నిజామాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:15 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకొంటారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. మొదట టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని, ఆ తర్వాత నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. నూతన భవన సముదాయంలో అధికార యంత్రాంగంతో సీఎం కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు లక్ష మందితో భారీ సభ తలపెట్టినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు తదితరులు సభా ఏర్పాట్లను పరిశీలించారు.