Kamareddy | హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కామారెడ్డి, గజ్వేల్.. రెండు స్థానాల నుంచి బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోతున్నది. ప్రత్యేకించి కామారెడ్డి తన పూర్వ చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి గ్రామాలకు గ్రామాలు కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. గ్రామాల్లో సర్పంచుల నేతృత్వంలో సమావేశాలు నిర్వహించి ‘సారే రావాలి.. కారే గెలువాలి’ అనే పట్టుదలతో ఏకగ్రీవ తీర్మానాలు చేసి, హైదరాబాద్ బాటపడుతున్నారు.
శనివారం ఈ నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో 10 గ్రామ పంచాయతీల నుంచి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షులు, ఆయా గ్రామాల పెద్ద మనుషులు హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చి సీఎం కేసీఆర్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ ప్రగతి కోసం ఊరూరా తామే తిరిగి సీఎం కేసీఆర్‌ను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతినబూనారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకముందే.. డిసెంబర్లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే కామారెడ్డిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామం కామారెడ్డిలో ఉన్నదని, అందుకే అక్కడి నుంచి పోటీచేస్తున్నారనే వాదన మాత్రమే కాదు అంతకంటే బలమైన నేపథ్యం ఉన్నదనేది చాలా మందికి తెలియదు.
కామారెడ్డి నుంచే ఏకగ్రీవాలు షురూ
కామారెడ్డి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉన్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీకి తొలి ఏకగ్రీవాన్ని నమోదు చేసిన చరిత్ర కామారెడ్డి నియోజకవర్గానికే దక్కింది. నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో మొత్తం 13 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) ఉంటే అందులో 9 ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకొన్నది. 4 స్థానాలకు ఎన్నికలు జరిగితే వాటినీ నాడు టీఆర్ఎస్సే సొంతం చేసుకొన్నది. సీఎం కేసీఆర్ పూర్వీకుల ప్రాంతంకూడా కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉండటం మరో విశేషం.
రెండు దశాబ్దాలుగా నర్సింగరావే ఎంపీపీ
కామారెడ్డిలోని మాచారెడ్డి మండల ప్రస్తుత ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు. 2001లో జరిగిన ఎన్నికల్లో 13 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకొని ఎంపీపీగా ఎన్నిక అయింది ఆయనే. అప్పటి నుంచి ఇప్పటి దాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయనే ఎంపీపీగా కొనసాగుతుండటం విశేషం.
కామారెడ్డి బ్రిగేడియర్ కేసీఆర్
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ఉద్యమరథ సారథి, సీఎం కేసీఆర్.. కామారెడ్డి బ్రిగేడియర్‌గా వ్యవహరించారు. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమవ్యాప్తికి దోహదపడేందుకు పార్టీ నిర్మాణం కీలకమని భావించి ప్రతి మండలానికి ఒక బ్రిగేడియర్‌ను నియమించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి మండలానికి బ్రిగేడియర్‌గా బాధ్యతలు స్వీకరించి, మండలంలోనే రెండు రోజులు బసచేశారు. మండలంలో నాడున్న 18 గ్రామ పంచాయతీలకు పార్టీ గ్రామ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు ఆయనే స్వయంగా దగ్గరుండి వేశారు.
తొలి ఉద్యమకేసు ఇక్కడే
తెలంగాణ భావజాలవ్యాప్తి కోసం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులపై ఉమ్మడి రాష్ట్రంలో రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌లు, రైల్వే కేసులు వేలాదిగా నమోదైన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు, యువకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. తెలంగాణ ద్రోహులపై చెప్పులు విసిరిన గడ్డకూడా కామారెడ్డే కావడం విశేషం. కామారెడ్డిలో నిర్వహించిన నిరసన సందర్భంగా ఉద్యమకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టారు. కొమ్ముల తిరుమల్రెడ్డిసహా 11 మంది ఉద్యమకారులు 14 రోజులు జైలు శిక్షను సైతం అనుభవించారు.
కేసీఆర్ తొలి కూలిపని ఇక్కడి నుంచే
ఉద్యమ నిర్మాణంలో భాగంగా బహిరంగ సభల నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు పార్టీ అధినేత మొదలు అన్ని స్థాయిల కార్యకర్తలు కూలీపని కార్యక్రమాన్ని చేపట్టారు. దేశచరిత్రలో ఒక రాజకీయ పార్టీ కూలీపని ద్వారా నిధులు సమకూర్చుకోవాలనే విధానాన్ని ప్రవేశపెట్టిన పార్టీగా బీఆర్ఎస్, అధినేతగా సీఎం కేసీఆర్ రికార్డు నెలకొల్పారు. ఈ కూలీపని ద్వారా ఉద్యమ ఆకాంక్షలను ప్రతి ఒక్కరిలో పరివ్యాప్తం చేయాలనే సంకల్పంతో నాడు కేసీఆర్ కామారెడ్డి పట్టణంలోని బాంబే క్లాత్ హౌజ్, దేశాయి బీడీ వర్క్స్‌లో కూలీపనిచేసి నిధులు సమకూర్చారు.
ఇదీ నేపథ్యం
తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకొన్న 2001 ఏప్రిల్ 27 తర్వాత రెండు నెలలకే అంటే 2001 జూన్ 4న నిజామాబాద్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగసభ అనంతరం అంటే నెల తర్వా త జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు నాగలి గుర్తుతో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పార్టీ బరిలో నిలిచి ఏకంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్తులను కైవసం చేసుకొన్నది. ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకోకముందే జరిగిన ఎన్నికల్లో 3 వేల గ్రామాల్లో సర్పంచులు, 12 వేల వార్డు సభ్యులను గెలుచుకొని రికార్డు సృష్టించింది.