హైదరాబాద్: జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోకెల్ల అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించిందన్నారు. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తుచేశారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువ చేస్తూ, వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నమన్నారు. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నదని సీఎం చెప్పారు.
ఇంకా సీఎం ఏమన్నారంటే.. ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 2017లో ప్రభుత్వం 4 కాలేజీలు ఏర్పాటు చేసింది. అదే క్రమంలో 2020లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసుకోగా గతేడాదే వాటిని ప్రారంభించుకున్నం. మొన్న ఒకే రోజున 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకున్నాం. దీంతో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. 2014 నాటికున్న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 ఎం.బీ.బీ.ఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగింది. 2014లో ప్రభుత్వ ప్రైవేటురంగంలో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా, ఇవాళ మూడింతలు పెరిగిపోయాయి. ప్రతిఏటా పదివేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నదని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్తరించాలని, నిరుపేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నది. వరంగల్ నగరంలో 1,116 కోట్ల రూపాయల వ్యయంతో 2,458 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతున్నది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. మరో రెండు వేల పడకలతో నిమ్స్ ఆస్పత్రిని విస్తరించుకుంటున్నాం. నూతన భవనాల పనులకు ఈ మధ్య నేనే స్వయంగా శంకుస్థాపన కూడా చేశాను. వీటికితోడు బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాలు, ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో రోగులకు మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు దఫాలుగా నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో కోట్లాది మందికి దృష్టిలోపాలను సరిదిద్దగలిగాం. వీటికి తోడు కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ గర్భిణీలు, బాలింతలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు తల్లీపిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగాం’ అని చెప్పారు.
‘క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో అవసాన దశకు చేరిన రోగుల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్లను కూడా నిర్వహిస్తున్నది. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చివరి రోజుల్లో రోగులు ప్రశాంత జీవనం గడిపేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. 108, 104 వాహన సేవల కోసం ఇటీవలే అదనంగా 466 వాహనాలను ప్రారంభించాం. దీంతో ఇప్పుడు ఫోన్ చేసిన 15 నిమిషాలలోపు ఈ వాహనాలు వస్తున్నాయి. సకాలంలో వైద్యసేవలు అందుతుండటంతో ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం’ అని సీఎం అన్నారు.