ఏడేండ్ల వ్యవధిలోనే కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటి మయం అవుతుందని, రాష్ట్రం చీకటిమయం అవుతుందని, కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు పోతాయని భయపెట్టారని, కానీ సీఎం కేసీఆర్ తన పరిపాలనా దక్షతతో అనుమానలన్నింటినీ పటాపంచలు చేశారని అన్నారు. నేడు ఐటీ సహా పలు రంగాల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. తెలంగాణ నేడు చాలా రంగాల్లో ముందంజలో ఉన్నదని తెలిపారు. భౌగోళికంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆర్థికంగా దేశంలో నాల్గో స్థానంలో ఉన్నదని తెలిపారు. కరోనా టీకాలకు హైదరాబాద్ రాజధానిగా మారిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో హైదరాబాద్లోనే మూడింట ఒక వంతు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. టీఎస్ఐపాస్ వంటి ఉన్నతమైన పాలసీలతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నదని చెప్పారు.