నిర్మల్, ఏప్రిల్ 6 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లపల్లి గ్రామంలో రూ.11.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ..కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో ప్రధానంగా 12 మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా 335 పాఠశాలలు ఎంపిక కాగా మొదటి దశలో 260 పాఠశాలల్లో పనులు ప్రారంభించనున్నట్లు వివరాలను వెల్లడించారు. మన గ్రామాల్లో ఉన్న పాఠశాలలు ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు, గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.