మెదక్: తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందినదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో సరైన అసెంబ్లీ, సెక్రెటేరియట్ కూడా లేవన్నారు.
మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడమేగాక ఇప్పుడు 24వ కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించుకున్నందుకు మెదక్ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్ కలెక్టరేట్ ఆర్కిటిక్చర్ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్ ఆమెకు అభినందనందించారు.
దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నదని, స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిపోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.200 ఉన్న ఆసరా పింఛన్లను ఇప్పుడు రూ.4000 తీసుకొచ్చామని చెప్పారు.