హైదరాబాద్ : శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వెనుకబడి ఉన్నారు. ఓసీల్లోనూ పేదలు ఉన్నారు. పేదల కోసం ఎంత గొప్పగా చేశామన్నదే పాయింట్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంది. కానీ ఫలితాలు కనిపించలేదు. సంక్షేమం, అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తున్నాం. దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు జరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం.ఆధ్యాత్మిక పరిమళాలు కూడా వెదజల్లుతున్నాయి. మక్కామసీదు రిపేర్ జరుగుతోంది. చర్చిలకు కూడా నిధులు ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. బోనాల పండుగకు నిధులు ఇచ్చి వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. యాదాద్రి ఖ్యాతి విశ్వవిఖ్యాతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మతాలను గౌరవించాలన్నదే మా ప్రభుత్వ అభిమతం.
ఈ మధ్య రాజకీయాల్లో చీప్‌గా మాట్లాడుతున్నారు. మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా? అని మాట్లాడుతున్నారు. ప్రజలు కట్టే పనులను సమన్వయం చేసి తిరిగి ప్రజలకు ఎంత ఉజ్వలంగా, వారి అవసరాల కోసం ఎట్ల వాడుతామన్నది వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. మేం మొదటి టర్మ్‌లో తక్కువ మెజార్టీతో గెలిచాం. సెకండ్ టర్మ్‌లో మంచి మెజార్టీతో గెలిచాం. 32 జిల్లా పరిషత్‌లను గెలిచాం. మున్సిపాలిటీల్లో 136 గెలిచాం. హైదరాబాద్‌లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. మిగతా కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్దే విజయం. ఈ నేపథ్యంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గ్రామాల్లో వికాసం కనబడుతోంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.