హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయవ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయవ్యవస్థలో మొత్తంగా 4,348 పోస్టులు మం జూరు చేశామని చెప్పారు. హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగినందున 885 అదనపు పోస్టులను మంజూరు చేసిన ట్టు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సులో సీఎం కేసీఆర్ న్యాయ వ్యవస్థపై వరాల జల్లు కురిపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమస్యల పరిష్కారానికి చూపిస్తున్న చొరవను ప్రశంసించారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 పెంచేందుకు సీజేఐ కృషి చేశారని కొనియాడారు.
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని సీఎం పేర్కొన్నారు. జిల్లా కోర్టుల్లో పనిభారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మను కోరారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో జడ్జీల సంఖ్యను పెంచాలని సూచించారు. నాంపల్లి కోర్టులకు సమీపంలోని హార్టికల్చర్ విభాగానికి చెందిన స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాల సంఖ్యను 33కు పెంచామని, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టులకు అవసరమైన స్థలాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులందరికీ దుర్గంచెరువు వద్ద 3040 ఎకరాల్లో గృహ సముదాయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. దీని శంకుస్థాపనకు సీజేఐ మరోసారి రావాలని ఆహ్వానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రి సంయుక్తంగా భూమిని పరిశీలిస్తే, జడ్జీల గృహ సముదాయాల నిర్మాణం చేపడతామని తెలిపారు.
కేసుల సత్వర పరిష్కారానికి, లిటిగేషన్లను తగ్గించేందుకే రెవెన్యూ కోర్టులను రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ కోర్టుల ఉత్తర్వులపై అప్పీళ్లకు ఆసారం ఉన్నదని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం ఎక్కడకు వెళ్లినా.. రాష్ట్రంలో న్యాయ వివాదాల పరిషారానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే ఆ తరహా కేసులను సత్వరమే పరిషరించేందుకు న్యాయమూర్తులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.52 కోట్ల ఎకరాల రికార్డులను డిజిటలైజేషన్ చేసినట్టు తెలిపారు. ఎనిమిదేండ్లుగా అం దరి సహకారంతో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నదని, గతంలో మాదిరిగా ఇప్పుడు విద్యుత్తు సమస్యలు లేవని చెప్పారు.
వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ రంగాలు పురోగమిస్తున్నాయని వివరించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 201415లో రూ.1.12 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ఇప్పడు రూ.2.78 లక్షలకు చేరిందని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ రామసుబ్రమణ్యం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. తొ లుత ప్రముఖ నృత్యకారిణి యామినిరెడ్డి నేతృత్వంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం సభికులను రంజింపజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం తరఫున పలువురిని సత్కరించారు. సీఎం బహూకరించిన జ్ఞాపికల గురించి సీజేఐ ప్రస్తావిస్తూ.. దాశరథి.. నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని చెప్పారని, అందరికీ వీణలను జ్ఞాపికలుగా ఇచ్చి, తనకు మాత్రం జాతీయ పక్షి నెమలి బొమ్మను ఇచ్చారని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ న్యాయమూర్తులను సతరించింది. అసోసియేషన్ వెబ్‌సైట్‌ను సీజేఐ ఆవిషరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కే సృజన వందన సమర్పణ చేశారు.