CM KCR | ధరణి వెబ్పోస్టల్ ఉంది కాబట్టే రాబంధులు, పైరవీకారులు లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు. పర్యటలో భాగంగా మొదట మొదట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అయిజ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సభకు వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఇవాళ కొందరు దళారీలు మోపై, కడుపునిండా పని చేయనివారు, ప్రజల కోసం ఆలోచించనివారు, వాళ్ల జమానాలో కింద మీద చేసిన వారు ఇవాళ ధరణిని తీసివేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. ధరణితో డబ్బులు నేను హైదరాబాద్‌లో వేస్తే.. నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. ఎవరైనా రైతుచనిపోతే రూ.5లక్షలు పది రోజుల్లో వారి బ్యాంకుల్లో పడుతున్నయ్.
గతంలో రైతులు వడ్లు అమ్మితే.. పైసలు వచ్చేందుకు నెలలు పట్టేది. రైస్‌మిల్లు, సేట్ల చుట్టూ తిరిగే పరిస్థితులుండేవి. ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు చేస్తుంది. పైసలు సక్కగా వచ్చి బ్యాంకుల్లో పడుతున్నయ్. ధరణి ఉంది కాబట్టి రాబంధులు లేరు. పైరవీకారులు లేరు. పట్వారీలు, వీఆర్వోలు లేరు. ఇవాళ పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఐదు నిమిషాల్లో పట్టా అయిపోతుంది. మునుపటి రోజు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు? పట్టాకు ఎన్ని రోజులు పడుతుండే..? వాళ్ల దయ.. వాళ్లు రాసింది లెక్క.. వారు గీసింది గీత. ఇంత మంచి సదుపాయం మూడు సంవత్సరాలు కష్టపడి పని చేసి ప్రజల కోసం తీసుకువస్తే.. కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసి బంగాళాఖాతంలో విసిరి వేస్తామంటుంది. ఇది ధరణిని వేయడమా? ప్రజల బంగాళాఖాతంలో వేయడమా?’ అంటూ ప్రశ్నించారు.
ధరణి ఉంచాలా? తీసివేయాలా? అని సీఎం కేసీఆర్ సభలో పాల్గొన్న ప్రజలను ప్రశ్నించగా.. ఉండాలంటూ చేతులెత్తి నినదించారు. ఇంకా సీఎం మాట్లాడుతూ ‘ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్‌లో ఎక్కడైనా ప్రజలు ధరణి ఉండాలని చెబుతున్నారు. ధరణిని తీసివేస్తామన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. గతంలో కృష్ణమోహన్ రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు కార్యక్రమానికి వచ్చాను. ఆ రోజు పాలమూరు ఎట్ల మారింది? ఎట్లా ఉందో హైదరాబాద్ నుంచి గద్వాల దాకా బ్రహ్మాండంగా చూసుకుంటు వచ్చాం. చాలా ఆనందం కలిగింది. గతంలో ఎండిపోయి, ఇబ్బందిపడ్డ పాలమూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ధాన్యపు రాశులు, కళ్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వేస్టర్లతో కళకళలాడుతున్నది. కరెంటు, రైతుబంధు, దళితబంధు రావాలంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి’ అంటూ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.