హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి నాడు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఈ పథకం పూర్తితో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం కాబోతున్నదని తెలిపారు. తద్వారా పాలమూరు ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. పాలమూరు ప్రజల చిరకాల వాంఛను నిజం చేసినందుకుగాను ఈ నెల 16న నార్లాపూర్ పంప్‌హౌస్ వెట్న్ ప్రారంభోత్సవం, కొల్లాపూర్‌లో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభకు పాలమూరు ప్రతి పల్లె నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కదిలిరావాలని బుధవారం ఒక ప్రకటనలో మంత్రి పిలుపునిచ్చారు.
ఇక దేశంలోనే అగ్రగామిగా పాలమూరు
పాలమూరు ఎత్తిపోతలతో భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో 263 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి ఈ ఎత్తిపోతలకు నీళ్లు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాల ఆయకట్టు కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, పట్టుదలకు నిదర్శనమని కితాబిచ్చారు. ప్రాజెక్టు పూర్తికాకుండా కేసులు వేసి అడ్డుకున్న వారే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తవుతుండడాన్ని జీర్ణించుకోలేక మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు.