హుజూరాబాద్ : దళిత బంధు పథకం అమలులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అందరికీ, ప్రతి కుటుంబానికి వస్తది. ఈ పథకానికి అడ్డు పడుతున్న కిరికిరి గాళ్లకు అన్ని ఒక్కటే సారి చెప్తే హార్ట్ ఫెయిల్ అయి చస్తారని ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా అని సీఎం కేసీఆర్ తెలిపారు.
శాలపల్లి వేదికగా దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద రాకాసులతో పోరాటం చేశాను. భయంకరమైన పోరాటం చేశాను. భయంకరమైన పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. మీలో చాలా మంది ఉద్యమంలో పాత్రధారులే. 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తే ఒక లక్షా 70 వేల కోట్లు ఖర్చు అయితది. సంవత్సరానికి 30 వేల 40 వేల కోట్లు ఖర్చు పెడితే మూడేండ్లలో దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయి. సమస్యనే కాదు.. కానే కాదు. గవర్నమెంట్ పట్టు పట్టిన తర్వాత వంద శాతం విజయం సాధిస్తాం. మూడు నాలుగేండ్లలో దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయన్న గోరటి వెంకన్న కల నెరవేరాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.