
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి సేకరించాలని మనం డిమాండ్ చేస్తున్నామని, కేంద్రం నుంచి ఇంకా స్పందన లేదని చెప్పారు. ‘వారం రోజులు చూద్దాం. కేంద్రం ఆర్డర్ ఇస్తుందా? ఇవ్వనీ. డిసెంబర్ వరకు వరి వేయొచ్చు. తొందర అవసరం లేదు. నిజంగా కేంద్రం తీసుకుంటాం అంటే సంతోషంగా అందరం వరి వేద్దాం. రైతులు యాసంగిలో ఏ పంటలు సాగుచేయాలనేది స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకొవాలి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిది. వరి కాకుండా ఇతర పంటలు వేస్తే మంచి లాభం వస్తుంది. కొంతమంది మూర్ఖంగా, పిచ్చిగా మాట్లాడుతున్నారు. మరి నీళ్లు తెచ్చిర్రు.. ఎందుకు తెచ్చిర్రు? అంటూ వరి పంట వేయకుంటే ఎట్ల? అని అడుగుతున్నారు. నీళ్లు తెచ్చింది వరి వెయ్యమని కాదు. పంటలు వేసుకోమని. ఏ పంటలైనా వేసుకోవచ్చు. ప్రభుత్వం పెట్టుబడి ఇస్తుంది. కరెంటు ఇస్తుంది. నీళ్లు ఇస్తుంది. భూగర్భ జలాలు పెంచింది. పంటలు పండించి మంచిగా బతకమని ఇవన్నీ చేసింది. చాలా పంటలు ఉన్నాయి. అద్భుతమైన పంటలు పండుతాయి.
కేంద్రం తీసుకోనన్నా.. వరివేస్తే నష్టపోతం
శాసనసభ సమావేశాల్లో రైతాంగానికి స్పష్టంగా చెప్పిన. యాసంగిలో ఏ పంటలు వేయాల్నో నవంబర్ మొదటి లేదా రెండోవారంలో చెప్తమన్నం. కేంద్రం తీసుకోబోమన్నప్పుడు వరిపంట వేస్తే అమ్మడుపోదు. కేంద్రం తీసుకోనప్పుడు రాష్ట్రం కొనుగోలు చేయజాలదు. 15 రోజులుగా రెండుమూడుసార్లు రివ్యూలు చేసి, ఏయే పంటలు వేసేందుకు వీలుందని శాస్త్రవేత్తలను, అగ్రికల్చర్ యూనివర్సిటీని పిలిపించి చర్చించినం. కొన్ని రకాల సీడ్స్ మన దగ్గరలేకపోతే తెప్పించినం. వరికంటే మంచి లాభమొచ్చే పంటలున్నయి. నువ్వులు, ఆవాలు, పల్లికాయ, ఇతర 9-10 పంటలున్నయి. రైతాంగం నష్టపోవద్దు.. కాపాడుకోవాలేనని మేం ఇతర పంటలు వేయాలని చెప్పినం. ఇదే తీరులో శనివారం వ్యవసాయశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు.
ఎన్నో రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచాం
వందశాతం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని రకాల పోరాటాలు చేస్తం. ఇప్పటి వరకు కొంత ఓపిక పట్టా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మంచిగా సెట్ చేసుకుంటున్నం. అందుకే ఎన్నో రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో నిలిచాం. ఆర్థికంగా నంబర్ వన్, పంటలు పండించటంలో నంబర్ వన్, విద్యుత్ వినియోగంలో నంబర్ వన్, ధాన్యం సేకరించడంలో నంబర్ వన్, సంక్షేమరంగంలో నంబర్ వన్, దళితబంధు వంటి పథకం రూపకల్పన, అమలులో నంబర్ వన్‌గా నిలిచాం. కేంద్రానికి కండ్లు మండుతున్నయి. వణుకుతున్నరు. బీజేపీ రాయపూర్ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నడు.. కర్ణాటక మంత్రిని కూర్చోపెట్టి ‘తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు మాకూ అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి’ అని ముఖం మీద ఉమ్మేసి అడుగుతున్నరు. సిగ్గుండాలి. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడి ఎమ్మెల్యేలు తెలంగాణలో కలపమని అడిగిర్రు అంటేనే తెలంగాణ గొప్పతనమేందో అర్థమవుతుంది.