CM KCR | హైదరాబాద్ : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అక్టోబర్ 16న వరంగల్ వేదికగా జరగబోయే సింహాగర్జన సభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సారి తప్పకుండా 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సారి తప్పకుండా 95 నుంచి 105 మధ్య గెలుస్తామని అంచనా వేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. పూర్తి స్థాయి వడపోత తర్వాత, అనేక సర్వేల తర్వాత, బాధ్యతతో జాబితాను విడుదల చేశాం. అక్కడక్కడ ఏమైనా వివాదాలు ఉంటే అవే సర్దుకుంటాయి. మా పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీలో యుద్ధాలు ఉండవు. మేం ఒక్కటేసారి 115 సీట్లు ప్రకటించాం అంటేనే అర్థం చేసుకోవాలి. మాది ఎంత క్రమశిక్షణ గల పార్టీ.. మా దాంట్ల ఎంత గడిబిడి తక్కువగా ఉందో అర్థం చేసుకోవాలి. ఎక్కడ్నో ఒకట్రెండు చోట్ల ఉంటే.. కొన్ని భూతద్దాలు పెట్టి చూపించే చానెల్స్ ఉన్నాయి. అవి మాకు తెలుసు. అవి మేం కేర్ కూడా చేయం, పట్టించుకోం. పొద్దున లేస్తే కావాల్సుకుని విషం చిమ్మే వాడు ఉంటే, అది వానికే రివర్స్ పడుతది తప్ప మాకేం పడదు అని కేసీఆర్ పేర్కొన్నారు.