CM KCR | సువిశాల దేశానికి ఆర్థిక మంత్రి.. రేషన్ దుకాణంలో మోదీ ఫొటో పెట్టలేదని డీలర్‌తో కొట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సభకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ఆర్థికమంత్రి కామారెడ్డిలో ఓ రేషన్ దుకాణం వద్ద నిల్చుండి.. ప్రధాని ఫొటో లేదని డీలర్‌తో కొట్టాడుతున్నది. డీలర్‌తో దేశ ఆర్థికశాఖ మంత్రి కొట్లాడుతరా? ఏం గొప్పదనం సాధించారని మోదీ ఫొటో పెట్టాలి? మెడికల్ కాలేజీ అడిగితే ఇవ్వలేదు. 300 ఎకరాలు ములుగు వద్ద జాగ ఇచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. పార్లమెంట్ ఎంపీలు గిరిజన యూనివర్సిటీ గురించి అడిగితే మీ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని అంటున్నరు. ఇంతకన్నా అన్యాయం ఉంటదా? మెడికల్ కాలేజీ ఇయ్యపోతిరి ఆ పుణ్యం మీకే దక్కుతుంది. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని మీరు గర్వంగా చెప్పుకుంటున్నరు కావొచ్చు.. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి తెలంగాణలో అని మేం అడగమా? దేశంలో ఉన్నది మన జనాభా మూడు శాతమే కానీ.. కంట్రిబ్యూట్ చేసేది జీడీపీ 4.9శాతం ఉంది’ అన్నారు.
‘మోదీ నోట్లు రద్దు చేసిన సమయంలో ప్రధాని మోదీని వ్యక్తిగతంగా కలిశాను. ఆయన చెప్పింది వేరే.. చేసింది వేరు. ఆయన చెప్పిందాన్ని బట్టి నేను నమ్మి సమర్థించా. నల్లధనం పోతది, డిజిటల్ కరెన్సీ వస్తది.. టెర్రరిస్టులకు పైసలు దొరకకుండా ఉంటది అని ఎన్నో చెప్పారు. డిమానిటైజేషన్‌కు ముందు 11-16లక్షల కోట్ల కరెన్సీ చెలామణి ఉంటే.. ప్రస్తుతం 32.43లక్షల కోట్లు కరెన్సీ చెలామణిలో ఉందని చెప్పింది. మోదీ పాలనలో ఏం పాలసీ సక్సెస్ అయ్యింది. మాకు మందబలం ఉన్నం కాబట్టి.. ఏడుపడితే అటే మాట్లాడుతం, జైలుల్లో వేస్తాం అంటే ఎంత వరకు సమంజసం. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి కావడం లేదు. దేశంలో సరుకు రవాణా చేసే గూడ్స్ రైలు వేగం సగటు చైనాలో గంటకు 120 కిలోమీటర్లు.
ఆస్ట్రేలియాలో 80 కిలోమీటర్లు, అమెరికాలో 70, ఇంగ్లాండ్‌లో 75, ఇండియాలో గంటకు 24 కిలోమీటర్లు ఉంది. ఇదేనా దేశం. చెప్పుకుంటే సిగ్గుచేటు.. ఒకటే వందేభారత్ రైలు అని ప్రారంభించారు. ఇంతకు ముందు శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్ అని ప్రవేశపెట్టారు.. కానీ ఏ ప్రధాని రైలును ప్రారంభించలేదు. ఇంకా ఎన్నిసార్లు వందేభారత్ రైలును ప్రారంభిస్తారు? ఇప్పటికీ 14సార్లు ప్రారంభించారు. ఇంతకన్నా ఘోరం ఉంటదా? వందేభారత్ కన్నా గొప్పగా ఎన్నో రైళ్లు నడుస్తున్నయ్. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి మోదీ శంకుస్థాపన చేస్తారా? కేంద్రమంత్రి వచ్చి లిఫ్ట్‌లను జాతికి అంకితం చేస్తున్నరు. ఇదానే దేశం నడిపే పద్ధతి. అంతర్జాతీయంగా అమెరికాలో గంటకు 95-115 కిలోమీటర్ల వేగంతో ట్రక్కు స్పీడ్ ఉంటే.. భారతదేశంలో 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయ్’ అని వివరించారు.