హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): అప్రజాస్వామికంగా, ఆహంకారంతో, నిరంకుశంగా వ్యహరించిన ప్రభుత్వాల పట్ల సందర్భం వచ్చిన ప్రతిసారీ దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గుర్తుచేశారు. గతంలో ఏక్‌నాథ్‌షిండే మాదిరిగా నాదెండ్ల భాస్కర్‌రావు రూపంలో ఎన్టీ రామారావును కాంగ్రెస్ గద్దెదించితే.. రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో ఏకమైందని, దీంతో కేంద్రం తలవొగ్గి తిరిగి ఎన్టీఆర్‌ను గద్దె మీద కూర్చోబెట్టిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
దమ్ముంటే ఏక్నాథ్ను తీస్కరా
చావుకు అదే మంత్రం.. పిడుగుకు అదే మంత్రం.. పెండ్లికీ అదే మంత్రం అంటే నడవదు మోదీ. తమిళనాడులో దమ్ముంటే ఏక్‌నాథ్‌షిండేను తీసుకురా. తెలంగాణకు తీసుకొస్తే.. తెలంగాణ సమాజం నీకు సమాధానం చెప్తది. నీ ఉడుత ఊపులకు.. కూతలకు ఎవరూ భయపడరు. సిద్ధాంతపరంగా మేము కొట్లాడుతాం. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజ్వరిల్లే సంకుచితమైన విషప్రచారానికి తప్పకుండా విరుగుడు కావాలి. లేకుంటే దేశం పెద్ద ప్రమాదంలో పడుతుంది. శతాబ్ద కాలాన్ని దేశం నష్టపోవాల్సి వస్తుంది. బాధ్యత కల్గిన రాజకీయ నాయకుడిగా చెప్పడం నా ధర్మం. జరుగుతున్న పరిణామాలను చూస్తూ కూర్చొలేం.
రూపాయి విలువ అతి భయంకరంగా పతనం
రూపాయి విలువ అతి భయంకరంగా పతనమవుతున్నది. నిత్యవసరాల ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెరుగుతున్నాయి. నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు. కేంద్రం చెప్పిన లెక్కలే. ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా. తెలంగాణ కావాలని కోరుకున్నా.. బ్రహ్మాండంగా రాష్ర్టాన్ని సాధించుకున్నా. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నా.. తీర్చిదిద్దిన. ఎన్నో విషయాల్లో దేశంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. కానీ దేశం మొత్తాన్ని విషమయంగా తయారుచేసిన్రు. తెలంగాణతో పాటు ప్రతి రాష్ర్టాన్ని నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం. మేము కూడా పోరాటం చేస్తున్నాం.
75 ఏండ్లుగా బీజేపీ, కాంగ్రెస్ బ్లేమ్ గేమ్
కాంగ్రెస్ మీద బీజేపీ.. బీజేపీ మీద కాంగ్రెస్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. 75 ఏండ్లుగా దేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్. ఈ 75 ఏండ్ల రొటీన్ రాజకీయాల నుంచి దేశం బయటపడాలి. అప్పుడు ప్రబలమైన మార్పులు వస్తాయి. అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలని అమెరికా రాజ్యాంగాన్ని రాసిన జాఫర్సన్ చెప్పారు. ‘బ్లేమ్ గేమ్‌లు, పరస్పర దూషణభూషణలు కాదు కావాల్సింది. ప్రజలకు ఫలితాలు తెచ్చిపెట్టే, అన్ని రంగాల్లో దేశానికి స్వావలంబన శక్తిని తీసుకొచ్చే సింగపూర్ లాంటి నాయకత్వం దేశానికి కావాలి. డెంగ్జియోజిన్ లాంటి సంస్కరణలు తీసుకొచ్చే నాయకత్వం కావాలి.
గత మూడేండ్లుగా అనేక వందల మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో, ఇతర రంగాల నిపుణులతో మాట్లాడుతున్నా. దేశంలో 52 శాతం యువ పెట్టుబడి ఉన్నది. ప్రపంచంలో ఇంత యువశక్తి మరే దేశంలో లేదు. అద్భుతమైన ప్రగతిబాటలో పయనింపచేయాల్సిన యువతలో మత పిచ్చిలేపుతున్నారు. ఇది కాదు దేశం కోరుకునేది. సంకల్పం, గొప్ప నాయకత్వం ఉంటే.. గుణాత్మక మార్పు అంటే ఏమిటో భారత ప్రజానీకానికి వివరించి.. విప్లవబాటలో ప్రజలను పయనింపజేసి అద్భుతమైన ప్రక్రియకు దేశంలో శ్రీకారం చుట్టాలి. ఆ మహాయజ్ఞంలో ఒక సమిధగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది.
దేశంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం వద్దా?
దేశంలో నదుల నుంచి తీసుకోగలిగింది 70 వేల టీఎంసీలు. ఇప్పటివరకు 22 వేల టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటున్నది. దేశంలో పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదా? ప్రపంచంలో అతి పెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో 6,500 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. 4 వేలు, 3 వేల టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు రష్యాలో ఉన్నాయి. 1,450 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ చైనాలో, అమెరికాలో హోవర్డ్యాం 1200 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. ఇలాంటి ప్రాజెక్టులను నిర్మించుకునే సామర్థ్యం లేదు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక మూలన కరువు వస్తుంది. భారతదేశ భూ విస్తీర్ణం 83 వేల ఎకరాలు. దేశంలో 40 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూమి ఉన్నది. కానీ 75 ఏండ్ల దుర్మార్గమైన పాలనలో, పనికిమాలిన చెత్త పాలసీల వల్ల పిచ్చోళ్ల లెక్క మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం.
గుణాత్మక మార్పుకోసం జాతీయ పార్టీగా టీఆర్ఎస్
దేశంలో గుణాత్మక మార్పు రావాలి. అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోం. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలి. బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో ఉన్నది. దీనిని ఆపాల్సిన బాధ్యత యువత, మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులదే. దేశ రాజకీయాల నుంచి బీజేపీని తన్ని తరిమేయాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
పాలసీ ప్రకారమే వెంటాడుతాం
దేశం కోసం, ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం కచ్చితంగా పాలసీ ప్రకారం వెంటాడుతాం. వ్యక్తిగతంగా కేసీఆర్‌కు ఏమీలేదు. జాతీయ రాజకీయాల్లో, రాజకీయ సరళిలో గుణాత్మకమైన మార్పు రావాలని చెప్తే అర్థం కావడం లేదు. ఫ్రంట్ కడితే.. గెలిచాక కామన్ మినిమం ప్రోగ్రాం ఉంటుంది. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్.. సీఎస్టీ మొదలుపెట్టిండు. తర్వాత కేంద్రం జీఎస్టీ మొదలుపెట్టింది. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గొంతు పగిలిపోయేటట్టు నో జీఎస్టీ అని గొడవ పెట్టిండు. ఏదో కారణంగా అప్పుడు జీఎస్టీ అమలు కాలేదు. తర్వాత మోదీ ప్రధానమంత్రి అయ్యాక జీఎస్టీ మొదలుపెట్టిండు. ఇదే చిదంబరం వ్యతిరేకించిండు. ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్హాల్లో చిదంబరం కలిస్తే అడిగా. దానికి చిదంబరం రాజనీతి అని సమాధానం చెప్పిండు.