హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమిచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభ మొదలుకాగానే స్పీకర్ అనుమతితో ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సాయన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో అనేక హోదాల్లో పనిచేశారని, వ్యక్తిగతంగా తనకు సన్నిహితుడని చెప్పారు.
ఎలాంటి సందర్భాల్లోనైనా చిరునవ్వు, చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. ‘సాయన్న మృదుస్వభావి, వివాదరహితుడు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఉన్నతవిద్య అభ్యసించారు. శాసనసభ్యుడిగా ఉన్నతస్థాయికి ఎదిగారు. పేదల పట్ల ఎంతో ప్రేమ, సానుభూతి కలిగి ఉండేవారు’ అని పేర్కొన్నారు. నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి అయినా హైదరాబాద్‌లో స్థిరపడ్డారని తెలిపారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన సాయన్న 1994 నుంచి 2009 వరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సేవలు అందించారని, 2014లో మరోసారి ఎన్నికై 2023 ఫిబ్రవరి 19న మరణించే వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. సాయన్న ఎప్పుడూ కంటోన్మెంట్ ప్రజల గురించే ఆలోచించేవారని సీఎం కేసీఆర్ చెప్పారు.
కంటోన్మెంట్‌ను జీహెచ్‌ంఎసీలో కలపాలని అనేకసార్లు తనకు విజ్ఞప్తులు అందించారని చెప్పారు. నగర ప్రజలతో సమానంగా తమకు మౌలిక సదుపాయాలు అందడం లేదని, ఆర్మీ నిబంధనల వల్ల పేదలకు ఇండ్లు కట్టించే పరిస్థితి కూడా లేదని చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తాను ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రికి చెప్పానని వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించారు. ఆ రకంగా అయినా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సాయన్న కూతురు లాస్యనందిత కూడా రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేశారని తెలిపారు. ‘సాయన్న కుటుంబం మా కుటుంబం.
ఆయన లోటు తీర్చలేనిది. ఆ కుటుంబానికి అండగా ఉంటాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సంతాప తీర్మానాన్ని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్‌పాషా ఖాద్రీ బలపరిచారు. ఈ సందర్భంగా వారు సాయన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఐదుసార్లు ఎన్నికవడాన్ని బట్టి ప్రజల్లో ఆయనకు ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. సాయన్న కుటుంబానికి సభ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తీర్మానం ఆమోదం అనంతరం సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.