హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల విక్రయంపై రైతులకు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, పట్టణాల్లో మాత్రం వారి చేతుల్లోంచి వెళ్లిపోతున్నాయని తెలిపారు. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో రైతులకు మేలు చేసేందుకు విక్రయ హక్కులు కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహిస్తానని ఆదివారం అసెంబ్లీలో చెప్పారు.
సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. అసైన్డ్ భూములను కొందరు గద్దల్లా కొట్టేసుకుపోతున్నరు. రైతులకూ ఆ హక్కు ఇవ్వాలని చెప్పిన. ప్రభుత్వ అవసరాలకు అసైన్డ్ భూమి తీసుకుంటున్నారనేది వాస్తవం కాదు. కొన్నిచోట్ల అసైన్డ్ భూములను అమ్మేసి పోయిర్రు. అది కొనుగోలు చేసిన వాళ్లు కూడా పేదవాళ్లే ఉన్నరు. మరికొన్ని చోట్ల పెద్దోళ్లు ఎన్నో కొన్ని డబ్బులు రైతులకు ఇచ్చేసి తీసుకున్నరు. ఎక్కడైనా ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటి భూములను తీసుకుంటుందే తప్ప, రైతుల భూమి తీసుకోవడం లేదు. ఇది కూడా తిరిగి ఆ పేదలకు రీఅసైన్ చేయాలని ఆదేశించినం. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అసైన్డ్ భూములకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసినట్టు రైతులు అమ్ముకోవడానికి హక్కులు కల్పిస్తం.
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం మా బాధ్యత
గతంలో పేదలకు పట్టాలిచ్చిర్రు కానీ జాగలు చూపించలేదు. కొన్నిచోట్ల చెప్పి ఇవ్వలేదు. ఇలా పాత సమస్యలను తీర్చేయండి. ఆయా జిల్లాల మంత్రులతో మాట్లాడి ఎన్ని పట్టాలు ఇవ్వగలుగుతారో ఇచ్చేయండని, మిగిలిన వారికి అవసరమైతే కొత్తగా సేకరించి ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వటం ప్రభుత్వ సామాజిక బాధ్యత. తప్పకుండా ఇది చేస్తాం. ఇక రాష్ట్రంలో తొలిసారి సఫాయన్నా.. నీకు సలాం! అంటూ తొలుత నినాదం ఇచ్చేందే బీఆర్ఎస్ పార్టీ.
పోడు భూములపై శాశ్వత హక్కు అటవీ శాఖదే
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సందర్భంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అటవీ భూములను గిరిజనులు ఆక్రమించుకొని కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్టు రుజువైతేనే వాళ్లకు పట్టాలిస్తరు. అది కూడా ఫారెస్ట్ లైక్ క్రాప్స్ (అట వీ అనుకూల పంటలు) పండించేందుకే అనుమ తి ఇస్తరు. ఇలాంటి భూములు ధరణిలోకి రావు. కారణం ఆ భూమికి ఓనర్ అటవీశాఖే. 500 ఏం డ్లయినా ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం ఆ భూములపై తుది యా జమాన్య హక్కులు ఎప్పటికీ అటవీ శాఖవే. రైతులకు యాజమాన్య హక్కు రాదు. ఇది రెవెన్యూలోకి రాదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్రం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది.
ఈ నిర్ణయం ప్రకారం ఆ భూమి గిరిజనులు సాగు చేసుకొని బతకడానికే ఉపయోగపడుతుంది. గతంలో పాస్‌పుస్తకాలు లేనివారికే మేం కొత్తగా ఇచ్చినం. ఇవి ధరణిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఎవరూ ఆ భ్రమల్లో ఉండొద్దు. ఎమ్మెల్యేల వినతి మేరకు గిరిజనులు కూడా మంచిగా బతకాలనే ఉద్దేశంతో కొన్ని పనులు చేసినం. త్రీఫేజ్ కరెంట్ ఇప్పించినం. ఇతర రైతులకు ఇస్తున్నట్టు వారికి కూడా రైతుబంధు ఇస్తున్నం. ఇటీవల కూడా రైతుబంధు పంపిణీ ప్రారంభమైన తర్వాత పోడు పట్టాలు ఇచ్చినం. అయినప్పటికీ కొత్తగా ఇచ్చిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు ఇచ్చినం. ఈ భూములకు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నం’ అని పేర్కొన్నారు.