Griha Lakshmi | హైదరాబాద్ : సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం( Griha Lakshmi Scheme ) ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) విస్తృత స్థాయి సమావేశంలో గృహలక్ష్మి పథకం అమలుపై సీఎం కేసీఆర్( CM KCR ) విధివిధానాలను ప్రకటించారు.
ప్రతీ నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని కేసీఆర్ తెలిపారు. అన్ని రకాల స్థలాల్లో ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాలి. ఈ పథకం కింద లబ్ధిదారులను మహిళలనే ఎంపిక చేసి వారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీదకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారునికి రూ. 3 లక్షలు ఇస్తామన్నారు.బ్యాంకు ఖాతాల్లో మూడు దశల్లో రూ. లక్ష చొప్పున రూ. 3 లక్షలు జమ చేస్తామని ప్రకటించారు. పునాది సమయంలో రూ. లక్ష జమ చేస్తాం. స్లాబ్ వేసిన అనంతరం మరో రూ. లక్ష, నిర్మాణం పూర్తయి సున్నాలు వేసే దశలో మిగిలిన రూ. లక్ష జమ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.