CM KCR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొద్దిగంత పచ్చవడ్డదని, ఏడెనిమిదేండ్ల నుంచి అందరం పట్టుబట్టి, జట్టు కట్టి నీరుగారిన, బీడువారిన తెలంగాణను తోవకు తెచ్చుకున్నమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. వంద కోట్ల బడ్జెట్ అయినా ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పానని, సర్పంచులకు ఇస్తే వాళ్లే పండ్ల మొక్కలు పంచి పెడతారని సూచించానని వివరించారు. వడ్లు పండించడంలో 2014లో తెలంగాణ 16, 17వ స్థానంలో ఉండేది. ఇప్పడు దేశంలో నంబర్ వన్‌గా ఉన్నదని పత్రికల్లో వార్తలు చూసి చాలా సంతోషం కలిగింది. ఎక్కువ వడ్లు పండించటం అంటే పచ్చని పంటలు ఉంటనే సాధ్యం అయితదన్నారు.
అయ్యేదా… పోయ్యేదా.. అన్నరు
తెలంగాణలో హరితహారం ప్రారంభించినపుడు కాంగ్రెస్ వాళ్లు ఇదొక జోక్లేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘అయ్యేదా.. పొయ్యేదా.. అన్నరు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉట్టిపడుతున్నది. ఇందిరాపార్కులో ఆక్సిజన్ అమ్ముతామని ఒకాయన ఆక్సిజన్ మిషన్ పెట్టిండు. మనకు భూములు లేవా? అడవులు లేవా? చెట్లు లేవా? విస్తృతంగా చెట్లు పెడితే అపారంగా ఆక్సిజన్ లభిస్తుంది. ఇంత వనరులు ఉన్న దేశంలో భయంకరంగా అడవులను నాశనం చేసి, మోడువారిన, బీడువారిన ప్రాంతంగా తయారు చేసినారు. నేను సీఎం అయిన తర్వా త మొదటి వారంలో అటవీ శాఖ బిల్లు పెట్టుకున్నం. ‘వానలు వాపసు రావాలె, కోతులు వాపసు పోవాలె’ అని పాట కూడా రాసిన. పచ్చని అడవి ఉంటే కోతులు ఊర్లళ్లకు రావు. అందుకే బ్రహ్మాండంగా చెట్లు పెట్టుకోవాలని హరితహారం చేపట్టినం. హరితహారం అని చెబితే ఎవరికీ అర్థం కాలేదు. చాలా మంది ఇదే దో నవ్వులాట అనుకున్నరు, కేసీఆర్‌కు ఏం పని లేదా? అన్నరు. ఇదేదో అయ్యేదా, పొయ్యేదా అన్నరు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జోకులేశారు. కానీ, కేసీఆర్ ప్రారంభించిన హరితహారం ఫలాలు తుమ్మలూరులో కనిపిస్తున్నయి. అటవీశాఖ వాళ్లు సఫారీలో అంతా తిప్పి చూపించారు. మూడు, నాలుగేండ్ల కింద ఇక్కడ పెట్టిన మొక్కలు బ్రహ్మాండగా పెరిగి పెద్దగై కనిపిస్తున్నయ్. ఈ రోజు దాదాపు 250 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేశారు. ఇట్లనే అడవులు ఎక్కడ నాశనమైపోయినవో వాటికి పునరుజ్జీవనం కల్పించాలి’ అని అన్నారు.
సర్పంచులందరూ అభినందనీయులు
తొమ్మిదేండ్లలో తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని, ఇదేదో మాటలు చెబితే, తమాషాలు, కథలు చెబితే సాధ్యం కాదని సీఎం అన్నారు. ఈ హరిత యజ్ఞంలో ఎలాగూ అటవీశాఖ యంత్రాంగం అభినందనీయులని, అందరి కంటే ఎక్కువగా గ్రామ సర్పంచులు అని అన్నారు. తాను గతంలో చట్టం తెచ్చినపుడు వాళ్లకు కూడా కొంత కోపం వచ్చిందని, కానీ ఈ రోజు గ్రామాలు ఎంతో అద్భుతంగా, పచ్చగా ఉన్నాయని చెప్పారు. ‘ఇంతకు ముందున్న సర్పంచులకు హరిత కీర్తి దక్కలేదు. గ్రామాలను పచ్చగ చేసిన కీర్తి ఇప్పుడున్న సర్పంచులకే దక్కింది. దాన్ని మీరు కొనసాగించాలి. అదనపు డబ్బు లు కావాంటే ఏర్పాటు చేద్దాం గానీ హరితహారాన్ని పట్టువదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగ ఉంటది. మనందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే వాతావరణం అనుకూలంగా లేకపోతే ఏం చేయలేం. ఆస్తి ఉన్న వ్యక్తి ని ఎడారిలో విడిచిపెడితే ఏం చేస్తడు? ఎన్ని బంగ్లాలు ఉన్నా పనికి రావు. బతకడానికి అనుకూలమైన పర్యావరణ పరిస్థితులను నిర్మించడం కూడా మన తరం బాధ్యత. ఈ పట్టుదల చెడిపోకుండా ముందుకుపోవాలి’ అని ఆకాంక్షించారు.
సీఎం పర్యటన సాగిందిలా..
‘తెలంగాణ హరితోత్సవం’లో సోమవారం సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పారు వద్దకు చేరుకున్నారు. అకడ విద్యార్థులతో కలిసి మొకలు నాటిన కేసీఆర్.. కొద్దిసేపు ప్రత్యేక వాహనంలో ప్రయాణించి అటవీ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మొకల సంరక్షణకు సంబంధించిన అంశాలను మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ సీఎంకు వివరించారు. అనంతరం మహాగని రకానికి చెందిన మొకను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి నాటారు.
తెలంగాణ పచ్చదనానికి దేశవ్యాప్త ప్రశంసలు
రాష్ట్రంలో పెరిగిన పచ్చదనాన్ని చూసి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రంగా పేరొచ్చిందని తెలిపారు. ‘పంజాబ్, ముంబై, ఢిల్లీ, డ్రైవర్లు చెబుతున్నరు.. తెలంగాణ కహ్ తక్ రహ్తా బై.. అంటే అచ్చా పేడ్ లగ్తే.. ఝాడ్ రహ్తా వహా తక్ తెలంగాణ హై. ఝాడ్ ఖతం హోతా వహా తెలంగాణ ఖతం హోతా (తెలంగాణ ఎక్కడిదాకా ఉన్నదంటే మంచి చెట్లు ఎక్కడి వరకు ఉంటయో అక్కడి వరకు. పచ్చదనం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ తెలంగాణ సరిహద్దు ముగిసినట్టు) ఆ పేరును ఇంకా పెంచుకోవాలి. నా ఆఫీసులో ఇద్దరు కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్ హరిత సైనికుల్లా ఉండి, ఎవరు పీసీసీఎఫ్ ఉన్నా, వాళ్లకు నాకు, ప్రధాన కార్యదర్శికి సమన్వయం చేసి ఎప్పటికప్పుడు నిధులు ఇప్పించి అద్భుతమైన కృషి చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా దారులు, రిజర్వు ఫారెస్టులు బ్రహ్మాండంగా ఉన్నయి’ అని సంతోషం వ్యక్తం చేశారు.
సమిష్టి కృషితోనే హరిత తెలంగాణ
పచ్చదనం పెంచే ప్రయత్నంలో ప్రపంచంలోని రెండు దేశాలు బాగా చేశాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘చైనాలో గోబి అనే ఎడారి ఉన్నది. అది ఏటా కొన్ని వందల మైళ్లు ఇసుకతోటి భూమిని కప్పేస్తుంది. ఆ ఎడారి విస్తరిస్తే మన బతుకులు నాశనమైపోతయని చైనా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నది. పట్టుబట్టి, మొండిగా 500 కోట్ల మొక్కలు నాటినరు. పచ్చదనం తగ్గిపోతుందని గుర్తించి యుద్ధం చేసిన మరో దేశం బ్రెజిల్. వాళ్లు సుమారు 300 కోట్ల మొక్కలు నాటినారు. తెలంగాణలో కూడా ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటినం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నది. ఎంత అడ్వాన్స్ అయ్యామంటే.. ఏ ఊరుకు ఆ ఊర్లనే నర్సరీ, అక్కడే పల్లె ప్రకృతివనం, దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నం. ఇప్పటికే దాదాపు 176 అర్బన్ పార్కులు రూపుదిద్దుకున్నయి. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నరు. ఈ విజయం మనందరి విజయం, సమిష్టి విజయం ’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
అటవీ శాఖ పునర్వవస్థీకరణకు చర్యలు
అటవీ శాఖ వాళ్లు మన కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపాడని, ఇప్పుడే ఆ అధికారి భార్యకు ఉద్యోగ (డిప్యూటీ తహసీల్దార్) నియామక పత్రాన్ని ఇచ్చినట్టు చెప్పారు. ఆర్థికంగా కూడా ఆదుకున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరగకుండా ఉండేందుకు కొన్ని పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని, అవసరమైతే సాయుధ సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ మేరకు వాళ్ల రక్షణ కోసం హామీ ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 25 పోలీస్ స్టేషన్లు అవసరమని చెప్పారని, ఆ ప్రతిపాదనలు ఇస్తే వెంటనే మంజూరు చేస్తామని వెల్లడించారు. ఎలాగూ ప్రధాన కార్యదర్శి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నందున శాఖ పునర్వవస్థీకరణకు చేపట్టాల్సిన చర్యలను కచ్చితంగా తీసుకుందామని భరోసా ఇచ్చారు.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శం
తెలంగాణలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటున్నాయి. 2015 నుంచి చేపట్టిన హరితహారం నేటివరకు యజ్ఞంలా సాగుతున్నది. రాష్ట్రం పచ్చని పల్లెలతో స్వాగతం పలుకుతున్నది.
– అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
చరిత్రలో మైలురాయి
దశాబ్ది ఉత్సవాలు దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించి ఆశీర్వదించాలి.
–విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పునరంకితమవుదాం
సీఎం కేసీఆర్ పచ్చదనాన్ని ప్రాధా న్య అంశంగా తీసుకుని హరితహారానికి రూపకల్పన చేశారు. స్వయంగా సీఎం పర్యవేక్షిస్తుండటంతో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. ఇప్పటికే 273.33 కోట్ల మొక్కలను నాటాం. ఈ ఏడాది 19 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకొని 30.29 కోట్ల మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచాం. సీఎం హరితహార లక్ష్య సాధనలో ప్రభుత్వ ఉద్యోగులందరం మరోసారి పునరంకింతం అవుదాం.
–సీఎస్ శాంతికుమారి