సిద్దిపేట, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. నామినేషన్ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నామినేషన్ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు తమ నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.
ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు గ్రామస్థులు, మహిళలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌కు నుదిట తిలకం దిద్దారు. పార్టీ శ్రేణుల వద్దకు వచ్చి అభివాదం చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ పాటల పందిరి సీడీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌పై పార్టీ శ్రేణులు గులాబీ పూల వర్షం కురిపించారు.