CM KCR | జోగులాంబ గద్వాల : గట్టు ఎత్తిపోతల పూర్తయితే గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా రాబోతుందని కేసీఆర్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
గద్వాల జిల్లా పరిపాలన భవనం తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అని కేసీఆర్ తెలిపారు. హృదయపూర్వకంగా జిల్లా ప్రజాప్రతినిధులను, ఉద్యోగులను, ప్రజలను అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజు దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. పర్ క్యాపిట ఇన్‌కంలో, పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్లో, ఓడీఎప్ ప్లస్‌లో కూడా నంబర్ వన్‌లో ఉన్నాం. అన్నింటికి మించి ఉద్యమ సమయంలో ఇదే గద్వాలలోని నడిగడ్డకు వచ్చినప్పుడు.. ఓ ఊరికి వెళ్లాను. చాలా ఆవేశం వచ్చి అక్కడ తాను, ప్రజలు ఏడ్చేశాం. ఏడవ్వాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే.. రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డకు నీళ్లు రాలేదని. అందుకోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి చేసుకుంటున్నాం. గట్టు లిఫ్ట్ పూర్తయితే అసలు గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుంది. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ను మళ్లీ సాధించుకున్నాం. అలంపూర్ కూడా అద్భుతంగా తయారు కాబోతుంది.
రాబోయే రోజుల్లో ఇంకా సాధించాల్సి ఉందని ఉద్యోగులకు కేసీఆర్ సూచించారు. ప్రభుత్వంలో మీరు చాలా ఏండ్లు పని చేస్తున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి అనేక స్టెప్స్ తీసుకుంటున్నాం. స్టంటింగ్ ప్రాబ్లం అని ఒకటి ఉంటుంది. పిల్లల పెరుగుదల ఆగిపోతే దానికి కారణం మాల్ న్యూట్రిషన్ కారణం. ఒకసారి ఒక జనరేషన్ స్టంటింగ్ బారిన పడితే.. అది రిపేర్ కావడానికి 150 సంత్సరాలు పడుతుంది. మన దగ్గర లాంటి బాధ రావొద్దనే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రపంచంలో ఎవరూ ఆలోచించని విధంగా కంటి వెలుగు కార్యక్రమం తీసుకున్నాం. ఇలాంటి హ్యుమన్ యాంగిల్ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ప్రజల ఆయురారోగ్యాలు బాగుండాలని అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
బాగుపడ్డామని చెప్పి రిలాక్స్ అయిపోతే మనం దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ అన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి మనం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఈ రకంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. గద్వాలకు మెడికల్ కాలేజీ రాబోతుంది. పాత పాలమూరు జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. సంపద పెరుగుతుంది కాబట్టి.. ఇది సాధ్యమైంది. పట్టు వీడకుండా ఇదే పట్టుదలతో ముందుకు పోతే అనేక విజయాలు సాధిస్తాం. ఐటీ రంగంలో కూడా ముందు వరుసలో ఉన్నం. పరిశ్రమలు, పెట్టుబడులు దండిగా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు.