స్టేషన్ ఘన్పూర్: ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం అయితరని, చెప్పుడు మాటలు నమ్మి ఎవరికి పడితే వాళ్లకు ఓట్లు వేస్తరని, అలాంటి పద్ధతి మారాలె అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎవరకి వారే సొంతంగా ఆలోచించి ఓటేసేలా ప్రజాస్వామ్య పరణతి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. ప్రజలు ఆషామాషీగా కాకుండా బాగా ఆలోచించి ఓటేయాలని కోరారు.
‘ఎన్నికలొచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటేసే విధానం రావాలి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా మన దేశంలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరణతి రాలె. ఆ పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నయ్. మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాలె. ఈ దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక హక్కు ఓటు హక్కు. ఆ హక్కును సరిగ్గా వినియోగించుకుంటెనే మంచి జరుగుతది. అభ్యర్థి గుణగణాలను, పార్టీ నడవడికను, చరిత్రను బాగా తెలుసుకుని ఓటేయాలె. అభ్యర్థుల, పార్టీల చరిత్రపై చర్చ జరిగితేనే రాయేదో, రత్నమేదో తేల్తది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలె’ అని సీఎం సూచించారు.
‘బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. నాకంటే గొప్ప ఉద్యమకారులు ఘన్పూర్లో ఉన్నరు. బీఆర్ఎస్ పుట్టగానే ఘన్పూర్లో గులాబీ జెండాలు ఎగిరినయ్. బీఆర్ఎస్ పార్టీ 15 ఏండ్లు ఉద్యమం చేసి మీ ఆశీర్వాదంతోని గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్నది. మరె గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన ఎట్లున్నది..? అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో మీరు ఆలోచించాలె. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. జయశంకర్ సార్ లాంటి వాళ్లు వద్దువద్దని ఉద్యమిస్తున్నా కూడా ఫజల్ అలీ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా కాంగ్రెసోళ్లు తెలంగాణను ఆంధ్రాలో కలిపిండ్రు’ అని ఆయన విమర్శించారు.