హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిసు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెకర్లు, సంబంధితశాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్యూ టీంలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రెడ్అలర్ట్ ఉన్నందున పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నానని, అవసరమైతే వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీవర్షాల నేపథ్యంలో 11న ప్రగతిభవన్‌లో తలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు, 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న ‘రెవెన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ తేదీలను వాతావరణ పరిస్థితులు మెరుగైన తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.