CM KCR on Gaddar | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్.. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ భౌతిక కాయానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్ తోపాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ కూడా నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు గద్దర్ బౌతిక కాయానికి నివాళులర్పించారు.