CM KCR | మక్క రైతుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. యాసంగిలో సాగైన మక్కలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 6.50లక్షల ఎకరాల్లో మక్క సాగైంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా రైతులు మక్కను సాగు చేశారు. దాదాపు 17.37లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మార్కెట్ ధర పడిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మక్కలను కొనుగోలుకు కేంద్ర ముందుకురాకపోయినా ప్రభుత్వమే సొంతం కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
వాస్తవానికి గత నెల కిందట మార్కెట్లో మక్కలకు మంచి డిమాండ్ ధర పలికింది. మక్కలకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1962 వరకు ఉండగా.. మార్కెట్లో రూ.2600 వరకు ధర పలికింది. కానీ, ఇటీవల ధర భారీగా పడిపోయింది. ఓ వైపు వర్షాలు, మరో వైపు ధర భారీగా పడిపోవడంతో రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బందిపడుతున్నారు. ఓ వైపు మక్కల కొనుగోలుతో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లినా.. రైతుల మేలు కోసం మక్కల కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.