CM KCR | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. కాగా, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి పంపిస్తున్నామని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు.
Moranchapalle4
బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్లు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. మోరంచపల్లి గ్రామంలో సుమారు వెయ్యి జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.
Moranchapalle3
వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Moranchapalle2
Moranchapalle1