BRS | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ శాతం గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. నామినేషన్ పత్రాలకు ఉదయాన్నే దేవాలయాల్లో పూజలు చేసి నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రాలు ర్యాలీలు, గులాబీ జెండాలు, పార్టీ కేడర్‌తో కళకళలాడాయి. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు భారీ ఎత్తున బైక్ ర్యాలీలు, బహిరంగ సభ, సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్‌తో పాటుగా ప్రజలు తరలివచ్చి తమ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలతో ప్రజలు, పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది.
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భరత్ కుమార్ తదితర నేతలు రాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ వేశారు. సిద్దిపేటలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. వీళ్లే కాకుండా బీఆర్ఎస్ నేతలు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు.
అభ్యర్థులు, కోనేరు కోనప్ప, పద్మా దేవేందర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్.భాస్కర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, ఆరూరి రమేశ్, కంచర్ల భూపాల్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, నోముల భగత్, చింత ప్రభాకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్.దివాకర్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి, బాల్క సుమన్, చల్మెడ లక్ష్మీనరసింహరావు తదితరులు నామినేషన్లు వేశారు. ఆసుపత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వచ్చిన దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.