చండూరు : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చండూరులో ఆదివారం జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఎస్ఐఐడీసీ చైర్మన్ బాలమల్లు తదితరులతో కలిసి హెలీప్యాడ్ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక అద్భుత పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్ళ లా చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి జరగడమే కాకుండా, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మునుగోడు గెలుపునకు బాటలు వేస్తాయన్నారు.
తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని, అందుకే ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా టీఆర్ఎస్ కే తమ ఓటు అని చెప్పుతున్నారని వివరించారు. వారి నుంచి వస్తున్న పాజిటివ్ స్పందన చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సభకు చండూరు మున్సిపాలిటీ తోపాటే, మునుగోడు నియోజకవర్గం మొత్తం నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చే విధంగా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.