సిద్దిపేట : దుబ్బాకలో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా ఈ నియోజకవర్గ ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం వెంకటేశ్వరస్వామి టెంపుల్, ప్రభుత్వ పాఠశాల, 100 పడకల ఆస్పత్రి, బస్టాండ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవన్నీ సీఎం కేసీఆర్ చలువేనని చెప్పక తప్పదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
దుబ్బాకలో ఎమ్మెల్యే బీజేపీ వ్యక్తి కావచ్చు. కానీ ప్రజలు మాత్రం తెలంగాణ వారు అని తెలిపారు. దుబ్బాకకు అందం పెరిగే విధంగా ఇవాళ బస్టాండ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం అని చెప్పారు. దుబ్బాకలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి మరువలేనిది అని కొనియాడారు. దుబ్బాకలో బస్టాండ్, తిరుపతి బస్సు కోసం కష్టపడింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చింది ఇంకోకరు అని పేర్కొన్నారు. గోవును గోవుగా పూజించేంది మేము.. కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీది అని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. పక్క పార్టీలను బెదిరించి గుంజుకునే పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ధరలు పెంచడం తప్ప అని గుర్తు చేశారు.
జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కోట్ల కొలువులు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బిజెపి చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఎక్కడా కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు తెలంగాణ ప్రభుత్వంలో తప్ప అని గుర్తు చేశారు. దుబ్బాకలో మంచినీటి కోసం బిందెలు లొట్టలు పడిన రోజులు గతంలో ఉండే.. నేడు ఇంటింటికి నల్లా నీరు వస్తున్నదన్నారు..
సీఎం కేసీఆర్ పంచుడు అయితే ధరలు పెంచుడు వంతు బీజేపీది అని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పితే మోసపోవడం ఇక కుదరదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. అందులో డౌటే లేదన్నారు. దుబ్బాక రైతులకు కావాల్సిన అవసరాల దృష్ట్యా నిధులు మంజూరు చేసేందుకు వ్యవసాయ మంత్రి ఒప్పుకున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.