గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:55

విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట

విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట

  • రాష్ట్రంలో 900కు పైగా గురుకులాలు
  • కేజీబీవీలు మరింత బలోపేతం
  • మోడల్‌ స్కూళ్లతో ఇంగ్లిష్‌ బోధన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారు. అందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటుకు దీటుగా గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటుతో నిరుపేదలకు చదువులను దగ్గరచేశారు. డ్రాపవుట్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్లను తగ్గించేందుకు జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ విద్యావిధానం బలోపేతం చేయడంలో భాగంగా నాలుగేండ్లలో రాష్ట్రంలో 900పైగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం వేర్వేరుగా గురుకులాలను నెలకొల్పారు. అన్ని గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వదిలించుకున్న మోడల్‌ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. దాదాపు 194 మోడల్‌ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నది. ఇందులో బాలికల కోసం 100 హాస్టళ్లు ఏర్పాటుచేశారు. గజ్వేల్‌లో విద్యాహబ్‌ను ఏర్పాటుచేశారు. బాలికల కోసం ఏర్పాటుచేసిన కేజీబీవీలను మరింత బలోపేతం చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి బాలికల డ్రాపవుట్లు లేకుండా కేజీబీవీల్లోనే జూనియర్‌ కాలేజీలను నెలకొల్పారు. బాలికల కోసం హైజీన్‌ కిట్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలుచేయని విధంగా సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారు. అదనపు నిధులతో వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తున్నారు. ఆరేండ్ల నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అదించడం కోసం చర్యలు చేపడుతున్నారు. వరల్డ్‌ క్లాస్‌ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపారు. logo