హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): నష్టాలు ఉన్నా, 49 వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం బతికించుకొంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు లీటరుకు రూ.40 అదనంగా పెరిగినా, కరోనాతో సతమతమవుతున్న తరుణంలో ఆర్టీసీని సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో నిధులిచ్చి ఆదుకొన్నారని గుర్తు చేశారు. గురువారం మంత్రి తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో నూతన ఐసీయూ, డయాలసిస్ సెంటర్, అంబులెన్స్‌లు, ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే వేల కోట్ల నజరానాలు ఇస్తామని ప్రధాని మోదీ అంటుంటే, పేదల రవాణా వ్యవస్థ అయిన టీఎస్ఆర్టీసీని సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకొంటున్నారని వెల్లడించారు. డీజీల్‌పై అడ్డగోలుగా సెస్‌లు పెంచిన మోదీ.. రాష్ర్టాలే పన్నులు తగ్గించాలంటూ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. రోజుకు రూ.2 కోట్ల మేర డీజిల్ రూపంలోనే సంస్థపై అదనపు భారం పడుతున్నదని, ఇతర ఖర్చులు పెరిగినందున చార్జీలు స్వల్పంగా పెంచకపోతే సంస్థ మనుగడ కష్టం అవుతుందని పేర్కొన్నారు.
2019 డిసెంబర్ తర్వాత ఆర్టీసీ చార్జీలు పెంచలేదని, సెస్‌ల రూపంలో సర్దుబాట్లు చేశామని స్పష్టం చేశారు. తార్నాక దవాఖాన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా రూపుదిద్దుకోవడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దవాఖానకు తన పువ్వాడ ఫౌండేషన్ నుంచి రెండు డయాలసిస్ యూనిట్లను ఇస్తానని ప్రకటించారు. కొత్తగా కొనే వెయ్యి బస్సుల్లో వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులే కొనాలని సూచించారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని, తొలి విడతలో 200 నుంచి 300 వరకు నియామకాలు త్వరలోనే చేపడతామని చెప్పా రు.
సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఉత్తమ సిబ్బందికి ఏటా అవార్డులు అందజేస్తామన్నారు. కాగా, ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ప్రగతి చక్రం అవార్డులు-2021 అందజేశారు. 102 మంది సిబ్బందికి మంత్రి అజయ్‌కుమార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ శాలువా కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు.