మహబూబాబాద్ : తనకు సీఎం కేసీఆరే బాస్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (Mla Shanker Naik) స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల దీవెనలు, సీఎం కేసీఆర్ (CM KCR) ఆశీస్సులతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి పోడు భూములను (Lands ) వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చి రైతుబంధు ( Raitu Bandu), రైతుబీమా, రుణ సదుపాయాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను ప్రజలు అనునిత్యం గుర్తుంచుకుంటారని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉండడం ప్రజల అదృష్టమన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని, రాష్ట్రంలో గృహలక్ష్మి, దళితబంధు, బీసీలకు రూ.లక్ష అందించే ప్రక్రియ నిత్యం కొనసాగుతుందని వివరించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మందికి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తున్నదన్నారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ (Bayyaram Steel) , కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Coach Factory), గిరిజన యూనివర్సిటీలను నెరవేర్చలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కుట్ర చేస్తే ఇక్కడి ప్రజలు సహించరని వెల్లడించారు. రేవంత్రెడ్డి రైతు వ్యతిరేకని విమర్శించారు. కేసీఆర్ను మళ్లీ సీఎం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.