CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీల వైఖరి గమనించాలి. అసలు మునగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రకాలుగా గంజికేంద్రాలు పెట్టే స్థాయికి పాలమూరును దిగజార్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి మంత్రులు, ముఖ్యమంత్రులు లేకుండిరా ? మరి ఎందుకు పాలమూరును ఎండపెట్టిన్రు. ముఖ్యమంత్రులు ఈ జిల్లా దత్తత తీసుకున్నారు. ఏం చేయలేదు. కనీసం మంచినీళ్లు ఇయ్యలేదు. మంచినీళ్ల కోసం ఎలా ఎదురుచూస్తుండే మనం.. ఇవాళ మిషన్ భగరీథ పుణ్యమానికి ప్రతి ఇంట్లో ప్రతి రోజూ నీళ్లు వస్తున్నయ్. నీళ్ల బాధ లేదు. మునుపు ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని వెళ్లి ఎన్నో అవస్థలు పడ్డాం. ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ స్టేజీకి చేరుకున్నాం’ అన్నారు.
‘భవిష్యత్లో కూడా తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు వెళ్లాలంటే.. బీఆర్ఎస్సే మనకు శ్రీరామరక్ష. ఒకమాట విచారించాలి. గొడగొడ ఏడ్చినా.. వలసపోయినా ఎవరైనా మాట్లాడిండా. కాంగ్రెస్, బీజేపీ జీవితంలో ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నారా? వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే నోర్లు మూసిశారు తప్పా.. కాంట్రాక్టులు పట్టుకొని పైకి వచ్చారు తప్పా.. తెలంగాణ రావాలే.. ఎవరైనా కాంగ్రెస్ నాయకుడో.. బీజేపీ పార్టీయో జీవితంలో జై తెలంగాణ అన్నరా? జై తెలంగాణ అంటరా? ఆ రోజు పిడికెడు మందితో బయలుదేరి తెలంగాణ అంతా తిరిగి యావన్మంది ప్రజలను చైతన్యం చేస్తే.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంక్షతో 2004లో మనతో పొత్తు పెట్టుకున్నది. తెలంగాణ రావాలి.. జాతీయ పార్టీ రావాలని కలిశాం. మళ్లీ దోఖా మొదలుపెట్టారు.. 2004లో గెలిచాక.. 2005లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. 15 సంవత్సరాల దాకా ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేశారు. ఎమ్మెల్యేలను కొనే కుట్ర చేశారు’ అని గుర్తు చేశారు సీఎం కేసీఆర్.
‘చివరకు నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే.. 33 పార్టీల లెటర్లు తెచ్చి మొఖానకొడితే, దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పిస్తే తెలంగాణ ఇచ్చేందుకు ముందుకువచ్చారు. కానీ, మర్యాదగ రాలేదు. ప్రకటన చేసి.. మళ్లీ వెనక్కి పోయారు. ఏడాది పాటు పిల్లలు చనిపోయి భయంకరమైన ఉద్యమాలు జరిగితే.. తెలంగాణలో ఇగ నూకలు కూడా పుట్టకుంట అయితదని తెలంగాణ ఇచ్చారు తప్పా.. మర్యాద ఇవ్వలేదు. వాళ్లు ఇవాళ ఎలా మాట్లాడుతున్నారో ఆలోచన చేయాలి. అడ్డంపొడువు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. గీడనే నాలుగు కిలోమీటర్లలో కర్నాటక ఉన్నది. కర్నాటకలో ఏం పరిస్థితి ఏం ఉన్నది ఇప్పుడు. మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. కర్నాటక రైతులు ఇక్కడకు వచ్చి తిట్టిపోతున్నరు’ అని తెలిపారు.
‘ఇంకా గమ్మతి ఏంటంటే.. ఆయన పేరు డీకే శివకుమార్. ఆయన కర్నాటకలో ఉప ముఖ్యమంత్రి. ఆయన తెలంగాణకు వచ్చి చెబుతున్నడు. కేసీఆర్.. మా సంగతి నీకు తెలుసా? కావాలంటే కర్నాటకు రా.. మేం ఐదుగంటల కరెంటు ఇస్తున్నమని అంటున్నడు. మాట్లాడేందుకు ఇజ్జత్ అన్నా ఉండాలె కదా? 24గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి ఐదుగంటలు ఇస్తున్నమ్ మేం సిపాయిలం అంటే నవ్వాల్నా.. ఏడ్వాల్నా? ఇదీ వాళ్ల పరిస్థితి. కర్నాటకలో అడ్డం పొడువు మాట్లాడి దెబ్బపెడితే ఐదుగంటలు ఇస్తమని అంటున్నా నాలుగు గంటలు వస్తలేదు. గతంలో మనం ఎన్నో ఇబ్బందులుపడ్డం. సగం పొద్దాంక.. సగం తెల్లందాక.. మోటర్లు కాలుడు.. షాకులు కొట్టుడు.. సచ్చిపోవుడు.. ట్రాన్స్ఫార్మ్ కాలుడు.. యాల్లకు రాకపోవడం.. కాలని మోటర్ లేకపోతుండే.. ఎండని పొలం లేకపోతుండే కాంగ్రెస్ రాజ్యంలో. మళ్లీ అదే కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకువచ్చి కరెంటును మాయం చేసుకుందా? ఆలోచన చేయాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.