హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనలో బీసీలు ప్రగతిపథంలో పయనిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధితోపాటు, విద్యాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో రూ.2 కోట్లతో నిర్మించతలపెట్టిన పెరికకుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు, పీర్జాదిగూడలో కోటి రూపాయాల నిధులతో ఎకరా స్థలంలో చేపట్టిన చాత్తాద శ్రీవైష్ణవ ఆత్మగౌరవం భవన నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డితో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీలు వెనకబడినవారు కాదని, వెనక్కి నెట్టివేయబడినవారని వాపోయారు. సీఎం కేసీఆర్ ఈ పదేండ్ల కాలంలో వారి వెనుకబాటుతనాన్ని పోగొడుతున్నారని పేర్కొన్నారు. ఎకరం ధర రూ. 100 కోట్లు పలికే ప్రాంతాల్లో బీసీ కులాలకు ఆత్మగౌరవ స్థలాలను ఇచ్చారని ప్రశంసించారు. జనాభాలో దాదాపు సగం ఉన్న బీసీలకు గతంలో 19 గురుకులాలు మాత్రమే ఉండేవని, ప్రభుత్వం 327 గురుకులాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వాటిలో 1,80,000 మంది బీసీ బిడ్డలు చదువుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్తోనే బీసీల అభ్యున్నతి, ప్రగతి సాధ్యమని వివరించారు.
బీసీల పెన్నిధి సీఎం కేసీఆర్: తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల పెన్నిధి అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నిరుపేద ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.లక్ష అందిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదివేందుకు రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని 100 శాతం సబ్సిడీతో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని వివరించారు. కేసీఆర్‌తోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. మరో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నదని కొనియాడారు.
ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలంలోపాటు, నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు పెరిక, చాత్తాద శ్రీవైష్ణవ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, పెరికకుల సంఘం అధ్యక్షుడు మద్దా లింగయ్య, సంఘం నాయకులు పాల్గొన్నారు.