CM KCR | సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గతి, బతుకు బచ్చన్నపేట చెరువోలెనే ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై.. భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘చేర్యాల బాగా చైతన్యం ఉన్న గడ్డ. చేర్యాల నాకు ఇష్టమని రాజేశ్వర్‌రెడ్డి చెప్పిండు. నింజనే నాకు ఇష్టం. మీకు తెల్వది. ఇక్కడ గుడిలో నా క్లాస్మేట్లు రారా..పోరా అని పిలుచుకునేటోళ్లే కొన్ని వందలమంది ఈ ప్రాంతంలో ఉన్నరు. లద్దునూరు, మద్దునూరులో, తరిగొప్పులలో ఎంతోమంది ఉన్నరు. వాళ్లంతాకు నా ప్రాణమిత్రులు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘నేను సిద్దిపేటలో ఇంటర్మీడియట్ చదుకునేటప్పుడు చేర్యాలలో హిందీ చెప్పే సార్ ఉండే. సైకిల్ మీద రోజు వచ్చిపోతుండేవాడిని. సైకిల్ మీద రోజు చేర్యాలకు సిద్దిపేట నుంచి వచ్చి హిందీ నేర్చుకొని పోయిన. హిందీ విశారద నేను పాస్ అయ్యింది చేర్యాల నుంచే. ఇది చాలామందికి తెలియదు. చేర్యాల సార్ దగ్గర చదువుకొనే.. పాస్ అయ్యాను. అందుకే నాకు బయటకుపోతే హిందీ మాట్లడతుంది. అందరి లెక్క పరేషాన్ కాను. హిందీలో మాట్లాడమంటే గంటలో మాట్లాడుతనేను. అది చేర్యాలపెట్టిన భిక్షనే. చేర్యాల ఒకప్పుడు సమితి ఉండే. నియోజకవర్గం ఉండేది. ఆ వెలితి కొద్దిగా కనిపిస్తుంది. బాధతో ఉన్నరు. అందుకే రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నరు. మీరు రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించండి.. నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ చేయించి బ్రహ్మాండంగా ప్రారంభం చేస్తాం’ అని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.
‘రాజేశ్వర్‌రెడ్డి చాలా తెలివికల్లోడు. ఉన్నత విద్యావంతుడు. కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసినోడు. ప్రజాసమస్యలపై అవగాహన ఉన్నోడు. కానీ గింత హుషారున్నడి నాకు తెల్వది. చేర్యాలకాడ ఓ సభ పెడితే సరిపోతదన్నడు. ఈడికచ్చినంక మందిలో నిలబెట్టి ఈ కాలేజీ కావాలని.. ఆ కాలేజీ కావాలని.. దొడ్లెకు వచ్చిన గోద పెండపెట్టదా? అన్నట్టు.. తప్పించుకోరాదు కదా? మందిలో నిలబెట్టి ఇవన్నీ ఇస్తవా లేదా? ఏం చేయాలి నేనిప్పుడు మరి? ఆయన అడుగుతున్నడు. రాజేశ్వర్‌రెడ్డి గన్ని కాలేజీ కేసీఆర్‌ను అడిగిండంటే రాజేశ్వర్‌రెడ్డికి ఆ ధైర్యం ఎక్కడిది? ఆయనకు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ ఏందీ.. కథేంది అన్నీ తెలుసు. పదేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్నడు. రోజు నా ఇంట్లనే ఉంటడు. కాబట్టి ప్రభుత్వం ఏం నడుస్తున్నదో ఆయనకు తెలిసింది. తెలంగాణలో ఇవాళ ఈ శక్తి ఉన్నది. 33 మెడికల్ కాలేజీలు పెట్టే శక్తి వచ్చింది. అనేక ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టేశక్తి వచ్చింది. అనేక రకాలుగా ప్రభుత్వం దగ్గర ధనముంది. కాబట్టి ఆ ధైర్యం వచ్చింది.. అడుగుతున్నడు. అదే సమైక్య రాష్ట్రంలో మన గతి ఎంట్ల ఉండే.. బచ్చన్నపేట చెరువోలెనే మన బతుకు’ అన్నారు.
‘రాజేశ్వర్‌రెడ్డి పనిమంతుడు. ఆయన సేవలు రేపు అందుకుంటరు. మళ్లీ మీరే అంటరు.. గర్వంగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మించి పని చేసే తెలివితేటలు ఉన్నయ్. అందుకే యాదన్నకు చెప్పిన.. కేబినెట్ ర్యాంకుతో ఆర్టీసీ చైర్మన్ పెద్దమనిషిగా ఉండు. నీ గౌరవానికి తక్కువ కావొద్దని చెప్పిన. నా మాట మన్నించి గౌరవించిండు. రాజేశ్వర్‌రెడ్డికి సపోర్ట్ చేసిండు. నేను యాదగిరిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నా. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య వచ్చి రాజేశ్వర్‌రెడ్డిని ఆశీర్వదించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు మనందరి తెలుపుతున్నా. రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్‌తో పాటు ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఎవడైనా వస్తడు. ఇక్కడ రోడ్డు డబుల్ అవుతుంది’ తెలిపారు.
‘చేర్యాల దండి దూరమేమి కాదు. దుద్దెడకు సిద్దిపేట ఎంతనో ఇది కూడా అంతే.. ఇక్కడ ఇబ్బందేం లేదు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెడితే సక్సెస్ అవుతయ్. కారు గుర్తుకు ఓటేసి పెద్ద మెజారిటీతో రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి. ఇవాళ మనసుకు తృప్తి ఉంది నాకు. పాత జాగలకు వచ్చిన ఒకటి. హెలీకాప్టర్‌లో రాలేదు. హెలీకాప్టర్‌లో వస్తే గన్‌మెన్ టైమ్ చూపిస్తడు పోవాలని. కుజార్తంగా నాలుగు మాటలు మాట్లడుకునేటట్టు అయ్యింది. చేర్యాలకు వస్తే సొంత ఊరికి వచ్చినట్లు అనిపించింది. మంచిగా ఆనందంగా మాట్లాడుకున్నం. మల్లన్న సాగర్ 50 టీఎంసీల ప్రాజెక్టు నిండుకుండలా మన నెత్తిమీదనే ఉన్నది. టప్పాస్పల్లి రిజర్వాయర్‌కు రూ.350కోట్లు మంజూరు చేశాం. ఆ కాలువ, పైప్‌లైన్ పూర్తవుతుంది. అది పూర్తయితే బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్. చేర్యాల ఏరియాలో కరువు అనేది అడుగుపెట్టకుండా కంట్రోల్ చేసే బాధ్యత నాది. దేవాదుల వస్తుంది. రంగనాయక సాగర్ నీళ్లు ధూళిమిట్టకు వస్తున్నయ్. అదేవిధంగా మల్లన్నసాగర్ నుంచి వస్తయ్. మొత్తం నీళ్లే నీళ్లు ఉండే పరిస్థితి చేర్యాలకు రాబోతున్నది’ అని వివరించారు సీఎం కేసీఆర్.