CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన సభల్లో సీఎం మాట్లాడారు. ‘నాడు ఎన్నికల కోసమే పింఛన్లు రూ.50, రూ.100, రూ.200 ఇచ్చారు. కొందరు రూ.600 సరిపోతది అన్నారు. విధివంచితులను ఆదుకోవడానికి మేం మొదట రూ.వెయ్యి, ఆ తర్వాత రూ.2016లు పెంచినం. కల్యాణలక్ష్మి కూడా మొదట్లో రూ.50 వేలు ఇచ్చాం. ఆర్థిక పరిమితి పెరగడంతో దానిని రూ.75 వేలకు, ఇప్పుడు లక్షకు పెంచినం. తెలంగాణ ఆర్థికవ్యవస్థ పెరుగుతున్న కొద్దీ.. పథకాల పరిధిని కూడా పెంచుతున్నం. ఎన్నికల తర్వాత పెన్షన్ను విడతలవారీగా రూ.5016కు పెంచుతాం’ అని వివరించారు.
నాడు ఎవ్వరూ రైతుల గురించి ఆలోచించలేదని, అంజుమన్ బ్యాంకువాళ్లు రైతుల మెడపై కత్తిపెట్టి ఇండ్లలోని తలుపులను, పశువులను తీసుకుపోయిన సందర్భాలున్నాయని సీఎం అన్నారు. ఈ దుస్థితి నడుమ దేశంలో రైతుబంధును పుట్టించిందే తాను అని చెప్పారు. ‘50 ఏండ్ల కాంగ్రెస్ పాలన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఉల్టా పెట్టుబడి ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రామాలు పచ్చబడాలని, రైతుల ముఖాలు తెల్లబడాలని, మళ్లీ పశువులతో కొట్టాలు, దొడ్లు కళకళలాడాలని, ధాన్యపు రాశులు రావాలని రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినం. మొదట రూ.4 వేలు, ఆ తర్వాత రూ.5 వేలు, ఐదారేండ్ల నుంచి రూ.10 వేలు ఇస్తున్నం. ఎన్నికల తర్వాత రైతుబంధును రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం. ఓట్ల కోసం నకిలీ హామీలు ఇవ్వకుండా.. ఓట్ల తెల్లారే ఎల్లెంకల పడకుండా ఓ క్రమపద్ధతిలో హామీలు ఇచ్చినం’ అని చెప్పారు. తెలంగాణలో పెట్టుకున్న రెసిడెన్షియల్ కళాశాలల నుంచి మెరికల్లాంటి విద్యార్థులు వస్తున్నారని సీఎం అన్నారు. ప్రస్తుతం ముస్లింలు, గిరిజనులు, దళితులు, బీసీలకు గురుకులాలు పెట్టుకున్నామని, ఎన్నికల అనంతరం అగ్రవర్ణ పేదలకు కూడా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెడుతామని హామీ ఇచ్చారు.
‘బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ విధమైన కార్యక్రమాలు అలు చేస్తున్నదో తెలుసు. పింఛన్లు పెంచుకున్నం. ఇప్పుడు మ్యానిఫెస్టోలో 5 వేలు చేస్తామన్నాం. అదేవిధంగా 93 లక్షల రేషన్ కార్డుదారులందిరకీ బీమా సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. కాబట్టి అందరికీ సన్నబియ్యం సప్లయ్ చేయాలని నిర్ణయించాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.