హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే.
150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్ ఉంటుంది.