ఎవరు చెప్పారు పేద పిల్లలకు వైద్య విద్య అందదని.. ఎవరు చెప్పారు ఎంబీబీఎస్ చదవాలంటే లక్షలు ధారపోయాలని? రాష్ట్రంలో ఇప్పుడు ఎంతోమంది నిరుపేద బిడ్డలు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి తెల్లకోటు ధరించారు. డాక్టర్ చదువు కోసం మన బిడ్డలు పడుతున్న కష్టాలను కండ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వెతలు తీర్చారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వైద్య విద్యను నిరుపేదల ముంగిట్లోకి తీసుకొచ్చారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి వేలాది సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చి నిరుపేదల డాక్టర్ కలను నిజం చేశారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వైద్య విద్యలోనూ నవశకానికి నాంది పలికారు.
లక్షలు ధారపోసి చదవాల్సిన మెడిసిన్‌ను ఉచితంగా అభ్యసించేలా చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారని, తమ కలలు నిజం చేసిన ఆయనను జీవితాంతం మర్చిపోలేమని, ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలపుకుంటున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
నిరుపేద పిల్లలకు చేరువైన వైద్య విద్య
Medical colleges | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండడంతో డాక్టర్ కావాలన్న తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘పేదబిడ్డలకు పెన్నిధిగా..’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందిస్తూ గురువారం ట్వీట్ చేశారు. ‘ఓ కూలి బిడ్డ, ఓ రైతు బిడ్డ, ఓ ఆటోడ్రైవర్ కొడుకు.. ఇలా ఎందరో నిరుపేద పిల్లలకు నేడు వైద్యవిద్య చేరువైంది. వైద్య సీట్లు పొందిన వారిలో ఎకువగా అమ్మాయిలే ఉండడం సాధికారతకు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం అందించిన గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకొని, విజయవంతంగా వైద్యవిద్య పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు అందించి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.’ అని ట్వీట్ చేశారు.
మా అన్నకు లక్షలు ఖర్చవుతున్నాయి.. నాకు ఫ్రీ
మా అన్నయ్య లోకేశ్‌కు నీట్లో రాష్ట్రస్థాయిలో 3,532 ర్యాంకు రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. దీంతో ఖమ్మంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఇప్పుడు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏడా రూ.2 లక్షలు ఖర్చవుతున్నాయి. ఇప్పుడు ఇంచుమించు అన్నయ్యకు వచ్చినంత ర్యాంకే నాకూ వచ్చింది. అయినా సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల కళాశాలలో ఉచిత సీటు వచ్చింది. రాష్ట్రంలో కాలేజీలు, అంతే స్థాయిలో సీట్లు పెరగడం వల్లే రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం దక్కింది. డాక్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరి కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌కు మా కుటుంబ రుణపడి ఉంటుంది.
– రాగిరి చరణ్, ఎంబీబీఎస్ విద్యార్థి, అలంకానిపేట, వరంగల్ జిల్లా
రూ. 20 లక్షలు అవుతుందన్నారు.. ఉచితంగా సీటొచ్చింది
మా చుట్టాల్లో ఇద్దరు డాక్టర్ చదువుతుండడంతో నేను కూడా డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 2022లో నీట్ రాస్తే 401 మార్కులు వచ్చాయి. జాతీయస్థాయిలో 1.9 లక్షల ర్యాంకు వచ్చింది. ప్రైవేటు కాలేజీలో సీటు వచ్చినా ఏడాదికి దాదాపుగా రూ. 20 లక్షలు అవుతుందన్నారు. అంత స్థోమత లేకపోవడంతో చేరలేదు. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ రాస్తే జాతీయస్థాయిలో 1.2 లక్షల ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 5,200 ర్యాంకు వచ్చింది. మొదటి కౌన్సెలింగ్‌లోనే జగిత్యాల మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఈసారి సీటు రావడానికి మాత్రం సీఎం కేసీఆర్ సారే కారణం. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకుంటే నా కల ఈసారి కూడా నెరవేరకపోయేది. డే స్కాలర్‌గా కాలేజీకి వెళ్లి వెళ్తున్నా. కాబట్టి ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా రీయింబర్స్మెంట్ అవుతుంది కాబట్టి నేను ఉచితంగా చదువుకుంటున్నట్టే లెక్క. ఒకప్పుడు డాక్టర్ చదవాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ దయవల్ల ఎవరైనా డాక్టర్ కావచ్చన్న ధీమా వచ్చింది. హ్యాట్సాఫ్ టు కేసీఆర్ సార్.
– అందె సత్య కిశోర్, వైద్య విద్యార్థి, జగిత్యాల
గీత కార్మికుడి కొడుక్కి ఎంబీబీఎస్ సీటు
మా నాన్న కల్లు గీసి నన్ను చదివించాడు. సీఎం కేసీఆర్ సార్ దయవల్ల నేను డాక్టర్‌ను కాబోతున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఎక్కడికక్కడ ప్రారంభించడం వల్లే నాకు 1.64 లక్షల ర్యాంకు వచ్చినా సీటొచ్చింది. అప్పట్లో 30 వేల ర్యాంకు వచ్చినా సీటు రాకుండే. ప్రైవేటు కాలేజీల్లో లక్షలు పోసి చదవాల్సి వచ్చేది. కేసీఆర్ దయతో నాలాంటి పేదోళ్లు కూడా ఇప్పుడు వైద్య విద్యను అభ్యసించగలుగుతున్నారు. నాకొచ్చిన ర్యాంకును బట్టి మూడో రౌండ్లో సీటు వస్తుందేమో అనుకున్నా. కానీ నాకు మొదటి రౌండ్లోనే వచ్చింది. అది కూడా మా సొంత జిల్లాలో. నన్ను డాక్టర్‌గా చూడాలన్న నా తల్లిదండ్రుల కల నేరవేరబోతున్నది. ఇదంతా కేసీఆర్ సార్ చలువే.
– వీరగోని వేణు, పరశురాంపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సీఎం కేసీఆర్ నా కలను సాకారం చేసిండు
నాన్న లేడు. అమ్మ ఇడ్లీ బండి నడుపుతూ నన్ను చదివించింది. డాక్టర్ కావాలి కొడకా అనేది. అమ్మ మాటలను ఎలాగైనా నిజం చేయాలని అనుకున్నా. అర్థిక పరిస్థితి అంతంతే అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్ల అమ్మ కలను నెరవేర్చగలుగుతున్నా. కష్టపడి చదవి నీట్లో ర్యాంకు సాధించా. సూర్యాపేటలో కేసీఆర్ సార్ ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. నా అదృష్టానికి నేనే పొంగిపోయా. అమ్మకలను నెరవేర్చే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటా.
– సండ్ర కమల్, శివనగర్, వరంగల్ జిల్లా
సీఎం సార్ వల్ల ఆ అదృష్టం నాకే దక్కింది
మా ఊర్లో ఎంతోమంది పెద్ద చదువులు చదువుకున్నా డబ్బులు ఖర్చుపెట్టలేక వైద్య విద్యకు అందరూ దూరంగా ఉన్నారు. కేసీఆర్ సార్ దయవల్ల ఇప్పుడు మా ఊర్లో నేను తొలిసారి వైద్యుడిని కాబోతున్నా. నీట్లో నాకు 540 మార్కులు వచ్చాయి. రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు లేకుంటే ఈ మార్కులకు నాకు సీటు వచ్చేదే కాదు. నాతోపాటు చదివిన 100 మందిలో 60 మందికి కూడా సీట్లు వచ్చాయి. సూర్యాపేటలో నాతోపాటు మరో 10 మంది స్నేహితులకు సీట్లు రావడం ఆనందంగా ఉంది. కొత్త కాలేజీలు పెట్టి మాలాంటి వాళ్లు డాక్టర్ విద్యను అభ్యసించేలా చేస్తున్న కేసీఆర్ గారికి థ్యాంక్స్.
– పాతూరి హేమంత్, సాంబయ్యగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సీటు వచ్చినందుకు హ్యాపీ
వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. సీటు రావడం అదృష్టంగా భావిస్తున్నా. కళాశాలలో సౌకర్యాలు కూడా ఎంతో బాగున్నాయి. జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-నిశ్చల్, వైద్య విద్యార్థి, హైదరాబాద్
సొంతూరిలోనే మెడిసిన్ గొప్ప అనుభూతి
మాది నిర్మల్‌లోని ఆదర్శనగర్ కాలనీ. మా నాన్న ఇర్ఫాన్ షేక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మా అమ్మ ఆస్మా సుల్తానా గృహిణి. నేను చిన్నప్పటి నుంచి నిర్మల్‌లోనే చదువుకున్న. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తి చేసిన. మెడిసిన్ కోసం నీట్ రాసిన. నిర్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పుట్టిన ఊరిలోనే మెడిసిన్ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.
– రుమాన్ షేక్, ఎంబీబీఎస్ విద్యార్థి, నిర్మల్
కేరళలో ఉన్నవి 1,800 సీట్లే
మాది కేరళ. మా మమ్మీడాడీ ప్రైవేట్ టీచర్లు. నాగర్‌కర్నూల్‌లో సెటిల్ అయ్యారు. వారు నన్ను డాక్టర్‌గా చూడాలని అనుకొనేవారు. దీంతో కష్టపడి నీట్‌కు ప్రిపేరయ్యా. అనుకున్న ర్యాంకు రాకున్నా ఇక్కడే సీటు వచ్చింది. ఇక్కడ అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండడమే అందుకు కారణం. స్టడీస్ విషయంలో కేరళకు మంచి పేరు ఉన్నది. అయినా అక్కడి మెడికల్ కాలేజీల్లో 1,800 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అంతకు ట్రిపుల్ ఉన్నాయి. అందుకే నాకు ఇక్కడ ఈజీగా మెడికల్ సీటు వచ్చింది. మెడిసిన్ పూర్తి చేసి పేదలకు సేవ చేస్తా
– సచిన్ వినోద్, నాగర్‌కర్నూల్ (కరీంనగర్ మెడికల్ కాలేజీ)
కటాఫ్ పెరగడంతో ఈజీగా సీట్లు
సీఎం కేసీఆర్ సర్ మెడికల్ సీట్లు పెంచడం, 85 శాతం సీట్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించడంతో కటాఫ్ ర్యాంకు పెరిగింది. అందుకే నాకు ఈజీగా సీటు వచ్చింది. రెండో ప్రయత్నంలో నా చెల్లులు అద్వైత వర్షిణికి, మూడో ప్రయత్నంలో నాకు.. ఒకేసారి కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. ఇద్దరం ఒక దగ్గరే ఎందుకని నేను జగిత్యాలకు మార్చుకున్నా. మా కుటుంబంలో ఇద్దరికి ఒకేసారి సీట్లు రావడం నిజంగా అదృష్టమే. ప్రభుత్వం ఏ జిల్లాకు ఆ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లే మాలాంటి వాళ్లకు వైద్య విద్య అభ్యసించే అవకాశం లభిస్తున్నది. జనరల్ సర్జన్ కావాలన్నది నా లక్ష్యం.
– ఎనగందుల హరిచరణ్, జగిత్యాల