Telangana | మంచిర్యాల, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసికూన అయిన పదేండ్ల తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోటీపడుతున్నదని, అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంలో పంజాబ్ రాష్ర్టాన్ని దాటేసిన తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ రోజు అనేక రకమైన లక్ష్యాలు సాధించి, ఇంకా బాగా ముందుకు పోతున్నామంటే దానికి అధికారుల కృషే కారణమని అన్నారు. ఈ సందర్భంగా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. పరిపాలన సంస్కరణలు ఒక్క రోజులో అంతమయ్యేవి కావని, సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అనుభవమున్న ఛత్తీస్‌గఢ్ చీఫ్ అడ్వైజర్ సలహా మేరకు ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లిలాంటి జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నట్టు చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం విశాలమైన ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని అప్పటి మంత్రి జోగు రామన్న, ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తనను కోరారని గుర్తుచేశారు. ప్రజలకు మంచి జరగాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించినట్టు చెప్పారు. నిన్న నిర్మల్, నేడు మంచిర్యాల కలెక్టరేట్లు ప్రారంభించుకున్నామని, నేడో, రేపో ఆసిఫాబాద్ కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించుకుందామని అన్నారు. ఆదిలాబాద్‌లో కూడా పనులు ప్రారంభం అయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకొని అక్కడ కూడా ప్రారంభించుకొందామని చెప్పారు. మనం రాష్ర్టాన్ని 2,601 క్లస్టర్లుగా చేసి, ప్రతి దగ్గర వ్యవసాయ విస్తరణాధికారిని పెట్టడంవల్లే ఈ రోజు రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్నదని స్పష్టం చేశారు.
మంచిర్యాల వేదికగా రెండు పథకాలు
కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయంతోపాటు రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాలను మంచిర్యాల వేదికగానే ప్రారంభించుకోబోతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం వల్ల గొర్రెల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని తాను గర్వంగా చెప్తున్నానని అన్నారు. గొర్రెల సంఖ్యలో రాజస్థాన్‌ను దాటిపోయి మనం నంబర్ వన్ స్థాయికి చేరుకొన్నట్టు తెలిపారు. రెండో విడుత గొర్రెల పంపిణీ తర్వాత ఏ రాష్ట్రం కూడా మన దరిదాపులోకి రాదని అన్నారు. రాష్ట్రంలో 3.88 లక్షల మందికి దాదాపు రూ.6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నారని, రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గాయని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నామని చెప్పారు.
20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్
పామాయిల్ ఉత్పత్తిలో తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోవాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన స్పందన వస్తున్నదని చెప్పారు. ఐఏఎస్‌లు అంతకుముందు పంచాయతీలు, మున్సిపాలిటీల దిక్కు చూసేవారే కాదని, లోకల్ బాడీస్‌కు అదనపు కలెక్టర్లను పెట్టుకున్నాక చాలా బ్రహ్మాండమైన ఫలితాలను వస్తున్నాయని తెలిపారు. జూలై మొదటి వారంలో నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు నిమగ్నం కావాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతి కుమారి, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం:సీఎస్ శాంతికుమారి
తెలంగాణ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా ఇక్కడ పనిచేసిన అనుభవం తనకున్నదని చెప్పారు. అప్పట్లో మంచిర్యాల ప్రజలు తమ పనుల కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వందల కిలోమీటర్లలోని ఆదిలాబాద్‌కు చేరుకునేవారని గుర్తు చేసుకొన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతోనే మంచిర్యాల జిల్లా కల సాకారం అయ్యిందని తెలిపారు. సువిశాలమైన 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.55 కోట్లతో మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించడం.. ఈ ప్రారంభోత్సవంలో తాను పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. 2014లో ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను మంజూరు చేయడమే కాకుండా ఏడేండ్లలో రెండుసార్లు వేతన సవరణ చేసినట్టు చెప్పారు. ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచారని తెలిపారు. ఇప్పటికే ఎన్నో రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ రికార్డులు నెలకొల్పే దిశగా తీసుకెళ్తున్న సీఎం మార్గదర్శకత్వంలో మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు.
‘తెలంగాణ ఈ రోజు అనేక విషయాల్లో టాప్‌లో ఉన్నది. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వడంలో దేశంలోనే మనం నంబర్ వన్ అయ్యాం. ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే సాధ్యమయ్యాయి. తొమ్మిదేండ్లు గడిచిపోయినయ్. దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నాం. కానీ మధ్యలో రెండు పెద్ద దెబ్బలు తగిలినయ్. కరోనా అతలాకుతలం చేసింది. నోట్ల రద్దు రూపంలో చాలా భయంకరమైన ప్రమాదం వచ్చి మనల్ని కుంటుపడకొట్టింది. ఈ రెండు ఇబ్బందులు తలెత్తాక ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ బిడ్డలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇరిగేషన్ నిపుణులతో తెలంగాణను ప్లాన్ చేసుకోడానికి ఒక ఐదారు నెలలు పట్టింది. అంటే ఇప్పుడు కనబడే అభివృద్ధి, జరిగిన పనులు ఆరు, ఆరున్నర ఏండ్ల కృషి ఫలితంగానే సాధించగలిగాం’
– సీఎం కేసీఆర్
‘మంచిర్యాల జిల్లా కావాలనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన కూడా ఇక్కడికి వచ్చి వాగ్దానం చేశారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. మంచిర్యాలతోపాటు పక్కనే ప్రాణహిత బార్డర్లో ఉన్న చెన్నూర్ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ పోవాలంటే చాలా కష్టమయ్యేది. సిద్దిపేట ప్రాంతం కూడా మెదక్ జిల్లాలో అట్లనే ఉండే. ఆ సమయంలో నేను ఎన్టీఆర్‌తోపాటు పోయి మెదక్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సిద్దిపేట జిల్లా కావాలని నినాదం ఇచ్చా. కానీ అప్పుడు ఎందుకో అది సాధ్యం కాలేదు. భగవంతుని కృప, మనందరం చేసిన పోరాటం.. తెలంగాణ ఉద్యమ ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి ఇవాళ ఇవన్నీ మనం నెరవేర్చుకోగలిగాం’
– సీఎం కేసీఆర్
దుకాణాన్ని పెద్దది చేస్తా
మా నాన్న నేర్పిన ఈ మంగళి పనిని భీమారం బస్టాండ్ వద్ద చిన్న టేలా పెట్టుకొని 28 ఏండ్ల నుంచి కొనసాగిస్తున్న. నాకు భార్య, పాప సాక్షిత(ఇంటర్), సాహిత్ (ఎనిమిది)ను మా కులవృత్తినే నమ్ముకొని పోషిస్తున్న. ఈ దుకాణాన్ని పెద్దగా చేద్దామంటే డబ్బుల్లేవు. కరెంటు బిల్లులు కట్టుడు ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడిలాంటి కేసీఆర్ ఉచిత విద్యుత్తు ఇచ్చి ఆదుకున్నడు. ఇప్పుడు కుల వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తామనగానే మీ సేవలో దరఖాస్తు చేసుకున్న. డబ్బులు రాగానే టేలాని పెద్దది చేసి కొత్త కుర్చీలు కొంటా. స్వయంగా నా దేవుడి చేతుల మీదుగా రూ.లక్ష అందుకోవడం జీవితాంతం మరిచిపోను.
–మామిడి సత్యనారాయణ, భీమారం, కులవృత్తి లబ్ధిదారు