Telangana | బతుకులో భరోసా ఉండాలంటే.. ‘తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులైనా ఉండాలి. ఎదిగొచ్చిన కొడుకులైనా ఉండాలి’ అంటారు పెద్దలు. నిర్మలక్కకు ఆస్తుల్లేవు సరికదా.. అప్పులున్నయ్. కొడుకులున్నరు. ఇద్దరూ బుద్ధిమంతులే! పెద్దోడు ఆసరాకొచ్చిండు. ఇంటి బాధ్యత తన భుజాన వేసుకున్నడు. చెల్లె పెండ్లికి నిలవడ్డడు.తమ్ము ణ్ని చదివించిండు. భర్త, తను, పెద్ద కొడుకు ఈ ఆరుచేతులు కలిసినా.. అప్పులదే పైచేయి అయ్యింది. అవమానాలు ఎదురయ్యాయి. పగవాడికి కూడా రాకూడని కష్టం వచ్చింది. నిర్మలక్క జీవితంలో నిమ్మలం లేకుండా పోయింది. ఆ చేనేత చీకటి జీవితాల్లో నేతన్న బీమా వెలుగై వచ్చింది. సర్కారు పాలన ఆ కుటుంబానికి
అండగా నిలిచింది. గుండె పగిలిన నిర్మలక్క గుండె ధైర్యంతో ఏమంటున్నదో చదవండి…
మాది చేనేత కుటుంబం. నిమ్మపల్లి గ్రామం. బతకనీకి సిరిసిల్లకు అచ్చినం. ఊళ్ల జాగలేం లేవు. ఇన్ని దినాలూ అద్దె ఇంట్ల ఉన్నం. మా ఆయన మల్లికార్జున్ మగ్గం పనికి బోయేది. నేను బీడీలు సుట్టేది. మగ్గం బాగ తగ్గింది. బట్టకు, పొట్టగ్గిన తిప్పలయ్యింది. దేశంబోతే బత్కుతమని మా ఆయన 2008ల దుబాయ్ పోయిండు. ముగ్గురు పిల్లలు నాతో ఉన్నరు. మా పెద్దోడు సూర్యనారాయణ సిరిసిల్ల గౌర్నమెంట్ కాలేజీల చదివిండు. ‘ఇగ పెద్ద సదివిచ్చుడు మాతోని కాదు బిడ్డా!’ అనంటే.. ‘బాకీ తెచ్చి సదివియ్యమన్నడు’ మావోడు. అప్పటికే మస్తు అప్పులున్నయ్. మిత్తి మీద మిత్తి కట్టలేక నిండా మునిగున్నం. సెప్పంగ సెప్పంగ సదువు ఆపి నేసుడు పని నేర్సిండు. బాకీలు తీరుత్తనని పనిల దిగిండు. ఆయాల్టి సంది వాడే మా ఇంటి పెద్దయ్యిండు.
ఈడ కూలి పైసలతోని ఎల్లకపోతుండే. వాళ్ల నాన్న దుబాయ్‌ల చిన్నచిన్న పనులు చేస్తుండే. ఇంట్ల ముగ్గురం రెక్కలు ముక్కలు చేసుకున్నా మూడు పూటల తింటే అయ్యాల పండుగన్నట్టు ఉంటుండే! గిట్ల కాదని పెద్దోడు ‘నేను గిన దేశం బోత’ అన్నడు. దుబాయ్ ఏజెంట్లు మోసం చేసిండ్రు. మొత్తం అప్పులు ఆరు లక్షలయినయ్! అట్ల కొంచెం ఆగమైనం. ఎట్లయితేంది తండ్రి తానికి పొయ్యిండు. ఆడ మిలటరీ క్యాంప్‌ల ఆఫీస్‌బాయ్ లెక్క చేరిండు. గాడ ఇద్దరు ఎంత కష్టపడితేంది! బాకీ ఒడిస్తెనా!! పస్తులుండి కష్టపడి నాలుగు లక్షల బాకీ తెంపినరు. కొన్ని దినాలకు పెద్దోడు ఫోన్ చేసిండు. ‘ఏసీ పడక.. పానం పాడైతుందమ్మా’ అని చెప్పిండు. ‘బాధలు పడుకుంట ఉండుడు ఎందుకు బిడ్డా! ఈడనే ఏదో పని చూస్కో’ అని రమ్మని చెప్పిన. ఈడికి అచ్చినాంక దొరికిన పని జేస్కుంట ఉన్నడు. నేను దారం కండెలు సుట్టనీకి పోయేది. పొద్దంత దారం సుట్టీ సుట్టీ సేతులు పడిపోతుండే! మల్లా రాత్రికి బీడీలు సుట్టేది. బీడీలు సుడితే గౌర్నమెంట్ రెండువేలు పింఛన్ ఇస్తది. గా పైసలు మస్తు అక్కరకొచ్చేది. జర్రంత అప్పులు తీరుతున్నయ్ అన్నంతల కూతురుకు మంచి సంబంధం అచ్చింది. కట్నం లేకుండ చేసుకుంటమన్నరు. ఎంత కట్నం అద్దన్నా.. పిల్లకింత బంగారం పెట్టాల్నని మల్లా అప్పు చేయక తప్పలేదు. బాకీ నాలుగు లక్షలై కూసుంది. మా ఆయన ‘దేశం పోదాం’ అన్నడు. మావోడు సిరిసిల్లల వార్పింగ్ పనికి పోతా అన్నడు. సక్కగ పని చేస్కుంట.. చెల్లెలిని అర్సుకునేటోడు. ‘తమ్ముడా నా సదువు ఆగమైంది. నిన్నయినా సదివిస్తా’ అని రెండోవోణ్ని ఐటీఐ దాంక సదివిచ్చిండు.
గింత మంచి పిల్లగాడికి పిల్లను ఎవ్వలియ్యలే! ‘మీకు ఇల్లా, పొలమా! పిలగాడేం జేస్తడు’ అని అడిగేది. గమ్మతు మాటలు మస్త్ అన్నరు. గవన్నీ పిల్లగాడి దమాక్ కరాబ్ చేసినయేమో! ‘ఇగ నాకు పెండ్లి కాద’ని మనసుల పెట్టుకున్నట్టుండు. ఓ దినం ‘అమ్మా! ఈడిదాంక పొయ్యొస్తా’ అని గడప దాటిన బిడ్డ పొద్దుగూకినా రాలే. మర్నాడు (2022 అక్టోబర్ 31) పొద్దుగాల లోయర్ మానేర్ల తేలిండు. మాకు ధైర్యం చెప్పిన పెద్దోడు డ్యామ్‌ల పడి ఆత్మహత్య చేసుకున్నడు.
కొడుకు సచ్చిపోతే పుట్టెడు దుఃఖంల ఉన్న.పోస్టుమార్టం అయినంక శవాన్ని ఇంటికి తెస్తాంటే ఓనరు అద్దన్నడు. ఇంటి ముంగట నడిరోడ్డు మీద శవాన్ని పెట్టినం. ఓనరు ఇంట్లకు రానీయకపోతే యాడికి పోవాల్నో అర్థం గాలే! మా బిడ్డ మామ వాళ్లింటికి రమ్మన్నడు. కాటి నుంచి అల్లుడింటికి పోయినం. ‘మావా నువ్వు ఎందుకు బాధపడుతాన్నవ్. చెట్టంత కొడుకు పోయిండు. ఏడిస్తే వస్తడా? మీరూ మాతోని ఉండండి’ అని అల్లుడు ధైర్యమిచ్చిండు. గుండె పగిలిన మాకు చిన్న గూడు దొరికింది. ఇంతల్నే డబుల్ బెడ్ రూమ్ ఇల్లచ్చింది!
నాకు అయ్య లేడు. అవ్వ లేదు. తోడబుట్టినోళ్లు లేరు. కొడుకులున్నరని బతుకుతాన్న. చేతికచ్చిన కొడుకు ఆగమైపోయిండు. మా బతుకులన్నీ చీకటైనయ్. కొడుకు సచ్చిపోయిన రెండు నెలలకు నేతన్న బీమా కింద ప్రభుత్వం అయిదు లక్షలు ఇచ్చింది. మాకు ఎవలూ సాయం జేసేటోళ్లు లేరు. కేసీఆర్ సారే సాయం జేసింది. కేటీఆర్ సిరిసిల్లకు అచ్చి చెక్ ఇచ్చిండు. మమ్మల్ని బాకీల నుంచి ఆదుకున్నడు. ‘అమ్మా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తమన్నరు. అట్లనే ఇచ్చిండు. లేకుంటే మేం గూడ మా కొడుకులెక్క ఆగమయ్యేటోళ్లం. రోడ్డున పడ్డం ఇగ మాకూ సావే దిక్కని అనుకుంటున్నప్పుడు ఆడబిడ్డకు ఆపదొస్తె అయ్య లెక్క… అన్న లెక్క… కేసీఆర్ అన్న మమ్మల్ని ఆదుకున్నడు. బయట తెచ్చిన రుణాలన్నీ తీరినయ్. బాధలన్నీ పోయినయ్. ఇగ ఒక్క రుణం మిగిలింది. కేసీఆర్ అన్న ఒక్కనికే బాకీ పడ్డం. జీవితాంతం రుణపడి ఉంటం.
మా నాయినకు నేనొక్కడినే. నేను సిరిసిల్లల పుట్టిన. మా నాయనది నిమ్మపల్లి. పని కోసం సిరిసిల్లకు అచ్చిండు. మగ్గాలు పెట్టి లాస్ అయిండు. మాకు ఊళ్ల ఉన్న భూములన్నీ పోయినయ్. నాయిన తోని భీవండి పోయిన. అటునుంచెల్లి సూరత్ వెళ్లినం. నాయిన ఆడనే సచ్చిపోయిండు. అప్పుడు నాకు పద్నాలుగేండ్లు. నేను అమ్మమ్మ వాళ్ల ఇంటికి అచ్చిన. బడి మానేసి జీతం కుదిరిన. అప్పటి సంది కూలి బతుకే. పెండ్లి చేసుకొని కిరాయింట్ల ఉన్న. మొన్నటి దాంక పవర్ లూమ్ మీద సాంచెలు నడిపిన. నాయిన రోడ్డు మీదనే పోయిండు. అట్లనే కొడుకు సచ్చిపోతే రోడ్డు మీదే పెట్టుకున్న. బతుకిట్ల బజారుపాలైందని ఏడుస్తున్న మాకు గవర్నమెంటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లిచ్చింది. ఇన్నేండ్లకు మాకంటూ ఉందని చెప్పుకోనికి ఇదొక్కటే ఉంది.
– మల్లికార్జున్
… నాగవర్ధన్ రాయల, ఫొటోలు : కనుకుంట్ల రవికుమార్