CM KCR | ‘ భారత్ జోడో యాత్ర అనేది ఒక జోక్.. కాంగ్రెస్ పార్టీ విఫల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నది’ అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కవర్ పేజీతో ఇండియా టుడే నవంబర్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. దేశానికి అన్ని రంగాల్లో తెలంగాణను దిక్సూచీగా నిలిపామని ఇండియా టూడే ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ.. హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేయడం పక్కా అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తాను పోటీ చేయడానికి ఒక వ్యూహం దాగి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీగా తమ వ్యూహాలు తమకుంటాయన్నారు. అదేమిటో ఎన్నికల తర్వాత మీకే తెలుస్తుందని స్పష్టం చేశారు.
`తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా రాష్ట్ర సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ రాకముందు కరంట్ కష్టాలు, నీటి కష్టాలు, రైతుల ఆత్మహత్యలతో దయనీయ పరిస్థితి నెలకొంది. తెలంగాణ వచ్చిన కొత్తలో వలసలు విపరీతంగా ఉండేవి. మేం తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణకే వలస వచ్చే పరిస్థితి వచ్చింది` అని సీఎం కేసీఆర్ చెప్పారు.
‘తెలంగాణ వచ్చిన నాడు తలసరి ఆదాయంలో రాష్ట్రం 18,19 స్థానాల్లో ఉండేది. ఇప్పుడు తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కర్ఫ్యూ, స్ట్రైక్, ల్యాండ్ అండ్ ఆర్డర్ సమస్య లేదు. రాష్ట్రంలో మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మా సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. 2018లో కూడా సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.