హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి (2014-15 ఆర్థిక సంవత్సరంలో) రూ.8,097 కోట్లుగా ఉన్న రాష్ట్ర మూలధన వ్యయం.. ఆ మరుసటి ఏడాదిలోనే ఏకంగా రూ.5,534 కోట్లు పెరిగి రూ.13,631 కోట్లకు చేరింది. ఇలా తెలంగాణ మూలధన వ్యయం ఏటికేడు క్రమంగా పెరుగుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.29,104 కోట్లకు చేరింది. ఇది ఆ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.29,046 కోట్ల మూలధన వ్యయం కంటే రూ.58 కోట్లు అధికం. దీంతో తెలంగాణ ఆర్థిక ప్రగతిని, క్రమశిక్షణను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన తొలి త్రైమాసిక నివేదికలో మరోసారి ప్రశంసించింది.

మూడు నెలల్లో 27 శాతం వ్యయం
ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, విద్య, వైద్యం తదితరాలపై ఖర్చుచేసే మొత్తాన్నే మూలధన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయం వల్ల సంపద సృష్టి జరిగి, భవిష్యత్తులో ఆదాయం సమకూరుతుంది. మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టే ప్రతిపైసా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాట వేస్తుంది. భవిష్యత్తు తరాల ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుంది. ఈ సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్న తెలంగాణ.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఆంక్షలు విధించినా, అభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నించినా మూలధన వ్యయంలో వెనక్కి తగ్గడంలేదు. వచ్చిన ప్రతి రూపాయికి మరో రూపాయి కలిపి వెచ్చిస్తూ.. సంపదను సృష్టిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మూలధన వ్యయంగా రూ.37,524 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశంలోనే అత్యధికంగా రూ.9,982 కోట్లు ఖర్చు చేసింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 26.77% సమానం.
ఉత్తరప్రదేశ్ కంటే 20 శాతం అధికం
తెలంగాణ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతుంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాలు మాత్రం ‘డబుల్’ వైఫల్యాలతో దారుణంగా వెనుకబడుతున్నాయి. ఆ రాష్ర్టాల్లో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నా, కేంద్రం ఎన్ని నిధులిచ్చినా ఆర్థిక వృద్ధి మాత్రం ‘ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్న చందంగా తయారైంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య తమ బడ్జెట్ అంచనాలో 6.77 శాతాన్నే మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. ఇది తెలంగాణతో పోలిస్తే 20%పైగా తక్కువ. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సైతం తొలి మూడు నెలల్లో మూలధన వ్యయంగా తన బడ్జెట్ అంచనాలో 16.97% ఖర్చు చేసింది. దీనికంటే తెలంగాణ వెచ్చించిన మూలధన వ్యయం 10%పైగా ఎక్కువ. ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాలన్నింటి కంటే తెలంగాణ మూలధన వ్యయం ఎక్కువగానే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల పరిస్థితి మరింత దయనీయం. ఈ ఆర్థిక ఏడాది మూలధన వ్యయానికి రూ.58,327 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిన కర్ణాటక.. తొలి త్రైమాసికంలో రూ.1,964 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. బడ్జెట్ అంచనాలో ఇది కేవలం 3.37%. కర్ణాటక కంటే తెలంగాణ చేసిన ఖర్చు రూ.8,018 కోట్లు (దాదాపు 24 శాతం) అధికం.

ఆ బీజేపీ పాలిత రాష్ర్టాల లెక్కలే లేవు
దేశంలోని అన్ని రాష్ర్టాలు తమ ఆదాయ, వ్యయ వివరాలను ప్రతినెలా కాగ్‌కు అందజేస్తాయి. అందులో కేంద్రానికి వెళ్లే పన్నులు, సుంకాలు, సెస్సులను మినహాయించి కాగ్ తుది గణాంకాలను వెల్లడిస్తుంది. కానీ, తాజాగా కాగ్ వెల్లడించిన వివరాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలైన అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, సిక్కింకు సంబంధించిన లెక్కలు సరిగా లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంగా రూ.5,583 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిన అరుణాచల్‌ప్రదేశ్.. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో లెక్కే లేదు. రూ.2,08,88 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిన అస్సాం ఏప్రిల్‌లో రూ.586 కోట్లు ఖర్చు చేసింది. మే, జూన్‌లో ఆ రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందన్న వివరాలను కాగ్ వెల్లడించలేదు. మణిపూర్, సిక్కిం రాష్టాలకు సంబంధించిన లెక్కలు పూర్తిగా అందుబాటులో లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే 5 నెలలు అవుతున్నా ఈ నాలుగు బీజేపీ పాలిత రాష్ర్టాలు తమ మూలధన వ్యయ వివరాలను కాగ్‌కు ఎందుకు సమర్పించడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.