హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్‌ను ఈ నెల 31న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకే గర్వకారణమైన మహాభాష్య కర్త, మహామహోపాధ్యాయ కొలిచాల మల్లినాథసూరి పేరిట ఆయన జన్మస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఫోన్లో ఆదేశించారు. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని ఉంటుందని, దేవాలయాలు సర్వజనులకు సాంత్వన చేకూర్చే కమ్యూనిటీ సెంటర్లు అని ఉద్ఘాటించారు.
హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన ‘బ్రాహ్మణ సదన్’ భావితరాలకు శాంతిని, భక్తి భావనలుపంచే ఆధ్మాత్మిక కేంద్రంగా, అన్నివర్గాలకు అందుబాటులో ఉండే కమ్యూనిటీ సెంటర్‌గా కొనసాగుతుందని ఆకాంక్షించారు. ‘సమైక్య పాలనలో అలజడులు, అంశాంతికి నెలవుగా ఉన్న తెలంగాణలో నేడు రాష్ట్ర ప్రభుత్వ కృషి, దైవకృపతో ఎటుచూసినా పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నది. దేశంలో మరెకడాలేనివిధంగా దేవాలయాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలైన బ్రాహ్మణ వర్గాలకు అండగా నిలిచింది. ప్రభుత్వం అందించిన సహకారంతో అర్చక వృత్తినే నమ్ముకొన్న పేద బ్రాహ్మణుల పిల్లలకు చకటి చదువు అందుతున్నది. వేదాలు చదువుతూ దైవకార్యంలో మునిగిన తమను పట్టించుకొనే ప్రభుత్వం ఉన్నదనే భరోసా అర్చకుల్లో పెరిగింది. పేద బ్రాహ్మణ వర్గానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో కూడా అమలు కావడంలేదు’ అని పేర్కొన్నారు.
బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం సందర్భంగా చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహించాలని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారికి సీఎం కేసీఆర్ సూచించారు. ఈ ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు, ప్రముఖ పుణ్య క్షేత్రాలనుంచి అర్చకులు, వేదపండితులు, ద్వాదశ జ్యోతిర్లింగాలుసహా దేశవ్యాప్తంగా ఉన్న కంచి కామకోటి తదితర పీఠాధిపతులు, ప్రముఖ హిందూ మత పెద్దలు, అన్ని రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాల పెద్దలు, దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. వారందరికీ ఎలాంటి లోటురాకుండా తగిన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు కావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ సెక్రటరీ రామకృష్ణారావుకు ఆదేశాలు జారీచేశారు. బ్రాహ్మణ సదన్‌లో దైవభక్తిని పెంపొందించే దిశగా ఆధ్మాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలువంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సత్యనారాయణ వ్రతం, యజ్ఞయాగాదులకు సంబంధించి అవగాహన కల్పించే సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పుస్తకాలను ప్రచురించాలని, డాక్యుమెంటరీలను రూపొందించాలని అన్నారు. మొత్తంగా బ్రాహ్మణ సదన్.. భక్తి, ఆధ్మాత్మిక భావజాలవ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్సెంటర్గా కొనసాగాలని తెలిపారు. పరిషత్ భవనం ప్రారంభం నాటికి మొత్తం ఎంతమందిని ఆహ్వానించాలి? ఇంకా అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రారంభించాలని రమణాచారిని ఆదేశించారు.
సమావేశంలో సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సాంసృతిక సలహాదారు రమణాచారి, వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.