CM KCR | అందోల్ : బీఆర్ఎస్ బహిరంగ సభలకు తండోపతండాలుగా తరలివస్తున్న జనాన్ని చూస్తుంటే సంతోషమేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వాళ్లకేమో కదిలించి తెచ్చే జనం.. మనకేమో కదిలివచ్చిన జనం.. అది వాళ్లకు మనకు ఉండే తేడా.. అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
చివరి దశకు ఎన్నికల ప్రచారం వచ్చింది. నేను చెప్పిన విషయాలు మజాక్ విషయాలు కాదు. రైతులు, పేదల యొక్క జీవన్మరణ సమస్యలు. కాంగ్రెస్ రాజ్యంలో బాధలు అనుభవించం. ఇప్పుడు మళ్ల ఆ బాధలు కొని తెచ్చుకోవద్దు. ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. యెన్కటికి ఒకని తద్దినానికి పిలిస్తే.. ప్రతిరోజు మీ ఇంట్ల ఇట్లనే జరగాలని దీవెన పెట్టిండంట.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు. ఆ ముక్కిపోయిన, ములిగిపోయిన, మందిని చావగొట్టిన ఆకలి రాజ్యం కావాల్నా..? బ్రహ్మాండంగా రెండు, మూడు పంటలు పండిచి, మన నీళ్లు, మన గాలి మనకు దక్కి, మన కరెంట్ మనకు దక్కి దర్జాగా బతికేటటువంటి రాజ్యం కావాల్నా..? దయచేసి ఆలోచించండి.. ఆషామాషీగా తీసుకోవద్దు. మనం గెలిచిపోతున్నాం అనే గర్వం పనికిరాదు. ఈ జనసమూహాన్ని చూసిన తర్వాత అందోల్‌లో గులాబీ జెండా ఎగిరిపోయిందని అర్థమవుతుంది. వాళ్లకేమో కదిలించి తెచ్చే జనం.. మీరేమో కదిలి వచ్చిన జనం. అది వాళ్లకు మనకు ఉండే తేడా.. అక్కడ్నే అర్థమవుతుంది గెలుపు అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.