నాటి అగ్ని ప్రమాద ఘటనతోనే కల్యాణలక్ష్మి.. 24న కల్పన కుమార్తె చంద్రకళ వివాహం
నాడు అమ్మ పెండ్లితో పథకానికి పునాది.. నేడు బిడ్డ పెండ్లికి అండగా నిలుస్తున్న పథకం
తెలంగాణ ఆడపిల్లలందరికీ ఓ మేనమామను
అందించింది ఆ తల్లి.. పేదింటి అమ్మాయిల పెండ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచింది. బిడ్డ పెండ్లికోసం దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతి అయి.. వెక్కి వెక్కి ఏడ్చిన ఆ తండ్రిని చూసి నాటి ఉద్యమనేత కేసీఆర్ హృదయం చలించిపోయింది. ఆయనలోని ఆర్తి, ఆ పేద తండ్రిపట్ల పెల్లుబికిన ఆర్ద్రత.. కేసీఆర్‌ను ఆ అమ్మాయికి మేనమామగా మార్చింది. పెండ్లి కట్నంతోపాటు ఖర్చులన్నీ భరించి తానే నిర్వహించారు.
ఉద్యమ నేత కండ్లు చెమర్చేలా చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి ఊపిరిపోసింది. ఇవాళ పది లక్షల మందికి పైగా ఆడపిల్లలకు కల్యాణాలు జరిపించింది. ఒకవిధంగా నాడు ఉద్యమనేతకు ఆలోచనల ఊపిరులందించిన తొలి కల్యాణలక్ష్మి కల్పన.. ఇప్పుడు తన కూతురు చంద్రకళను కూడా కల్యాణలక్ష్మిని చేస్తున్నది. కూతురు వివాహానికి కల్యాణలక్ష్మి పథకాన్ని అందుకొంటున్న కల్పనను.. నూతన కల్యాణలక్ష్మి కల్పన కూతురు చంద్రకళను యావత్ తెలంగాణ సమాజం ఆశీర్వదిస్తున్నది.
ములుగు, మార్చి 14: 20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఆ ఆడపిల్ల తండ్రి కీమానాయక్ను చూసి కండ్లనీళ్లు పెట్టుకొన్నారు. అపరిమితమైన ఆ శోకాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అతని కూతురు కల్పనకు అండగా నిలిచి దగ్గరుండి పెండ్లి చేశారు. కల్పన పెండ్లికి తన తల్లిదండ్రులు బానోతు కీమానాయక్-రుక్కమ్మ శ్రీరామనవమి ఎల్లినంక పెండ్లి పెట్టుకొని పెండ్లికి అవసరమైన రూ.50 వేలతోపాటు బంగారం కాలి బూడిద కావడం తెలుసుకొన్న కేసీఆర్ కల్పన వివాహాన్ని తన భుజాన వేసుకొని పెండ్లికి అయ్యే రూ.50వేల కట్నం, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం చేసి దగ్గరుండి పెండ్లి చేశారు. కొట్లాడి సాధించుకొన్న తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కూడా కేసీఆర్ కీమానాయక్ కండ్లల్లో కన్నీళ్లు మరచిపోలేదు. రాష్ట్రంలోని ఏ ఆడపిల్ల తల్లితండ్రులు కూడా కీమానాయక్లాగా బాధపడవద్దన్న ఆలోచనతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి శ్రీకారం చుట్టారు. గత ఏడేండ్లలో 10 లక్షల మంది పైచిలుకు ఆడపిల్లల పెండ్లిళ్లకు ఈ పథకం దన్నుగా నిలిచింది. నాడు కల్పన పెండ్లికి పునాది పడిన ఈ పథకం.. ఇవాళ ఆమె కూతురు చంద్రకళ పెండ్లికి అండగా నిలుస్తున్నది.
నేడు బిడ్డ పెండ్లికి అండగా నిలిచిన కల్యాణలక్ష్మి
వరంగల్ జిల్లా జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలో భర్త యాకుతో కలిసి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్న కల్పన పెండ్లి విషయంలో కేసీఆర్ చేసిన మేలును మర్చిపోకుండా కుమారుడి పేరు చంద్రశేఖర్‌రావు, కుమార్తె పేరు చంద్రకళ అని పేర్లు పెట్టుకొన్నది. బిడ్డను ఇంటర్మీడియట్ వరకు భర్తతో కలిసి చదివించిన కల్పన నేడు బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టేందుకు నిర్ణయించుకొన్నది. వరంగల్ కరెంటు ఆఫీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దుబ్బతండాకు చెందిన బానోతు చందర్‌కు ఇచ్చి తన కుమార్తె పెండ్లి చేసేందుకు 2021 డిసెంబర్ నెలలో వరపూజ చేశారు. కట్నం కింద తన గ్రామమైన మూడు చెక్కలపల్లిలో రెండెకరాల వ్యవసాయ భూమిని రాసిచ్చారు. ప్రస్తుతం కల్పన తన బిడ్డకు పెండ్లి చేసేందుకు వివాహ ఖర్చుల నిమిత్తం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఈ మేరకు కల్పన రూ.లక్షా 116లను తెలంగాణ సర్కార్ తరపున పొందేందుకు బిడ్డ పేరు మీద కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసింది. నాడు తన పెండ్లికి సాయం చేసి అండగా నిలిచిన పెద్ద సారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి బిడ్డ పెండ్లికి మేనమామ కట్నం అండగా నిలువనున్నది. తల్లి పెండ్లి సమయంలో కలిగిన ఇబ్బందులు, దుఃఖం నుండి పుట్టిన కల్యాణలక్ష్మి పథకం నేడు ఆమె బిడ్డకు పథకం రూపంలో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారనున్నది. ఈ నెల 24న చంద్రకళ వివాహం కల్పన-యాకూబ్ స్వగ్రామమైన మూడు చెక్కలపల్లిలో ఘనంగా జరగనున్నది. ఈ వివాహానికి హాజరు కావాలని పలువురు మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులకు కల్పన కుటుంబ సభ్యులు పెండ్లి పత్రికలను సైతం అందిస్తున్నారు.