హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షను యథావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘రిక్రూట్మెంట్ దశలవారీగా చేయాలని ముందే చెప్పాం. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చాం. నేను ఇంతకుముందే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదు. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. అలా చేస్తే ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయి.
విద్యార్థుల స్కాలర్‌షిప్పుల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చాంబర్లో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ప్రధాన కార్యదర్శి, మైనారిటీ కార్యదర్శితోపాటు మీరూ (ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ) ఇలా అందరూ కలిసి రేపో ఎల్లుండో కూర్చొని మైనారిటీ సంక్షేమం కోసం ఇంకా ఏమేమీ చర్యలు తీసుకుంటే బావుటుందో? చర్చించండి. ఓవర్సీస్ స్కాలర్షిప్స్, వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ వంటి అనేక విషయాలపై కమిటీలో చర్చించండి. మైనారిటీ సంక్షేమం విషయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అక్కడక్కడా కొన్ని కమిటీలు వేయాల్సి ఉన్నది. వాటన్నింటినీ వేద్దాం. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నంతకాలం మైనారిటీలను కడుపులో పెట్టుకొని చూసుకుందాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.