హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తమ బతుకులు ఎట్లుండెనో తాము మరిచిపోలేదని, కేసీఆర్ సీఎం అయినంక తమ బతుకులు ఎలా మారిపోయాయో అనుభవిస్తున్న తమకు తెలుసునని పలువురు రైతులు పేర్కొన్నారు. రాష్ట్రం రాకముందు తమను ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు కొందరు చెప్పే మాయమాటలను తాము నమ్మబోమని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు హాజరైన పలువురు రైతులు సీఎం కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై తమ అభిప్రాయాన్ని నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులను, ఇప్పుడున్న పరిస్థితులను పోల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, సాగునీరు ఇలా అనేక పథకాలపై మాట్లాడారు. ముఖ్యంగా నాడు ఎవుసం చేయడానికి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నారు. కరెంట్ కోతలు, సాగునీటి కష్టాలు, ఎరువులు, విత్తనాల కొరత ఇలా ప్రతి అంశంలో అప్పుడు అనుభవించిన ఇబ్బందులను నెమరు వేసుకున్నారు. నాడు తమ జీవితాలు ఇకపై ఇంతేనని.. మారవని అనుకున్నామని, కానీ తాము కోరుకున్నదాని కన్నా ఇప్పుడు ఎక్కువే అనుభవిస్తున్నామని పలువురు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇంతగనం చేసినోడు ఎవరున్నరు?
తెలంగాణ వచ్చినంకనే, కేసీఆర్ సీఎం అయినంకనే మా బతుకులు బాగుపడ్డయి. గతంలో మా గురించి పట్టించుకున్నోడే లేడు. పిల్లల నుంచి పండు ముసలి దాకా, కూలీ నుంచి రైతుల వరకు ఎవరికి ఏం కావాల్నో కేసీఆర్ అది చేసిండు. ఇప్పుడు కొందరు సీఎం కేసీఆర్ను ఆయన చేసిందేందని ప్రశ్నిస్తున్నరు. మా కోసం ఇంతగనం చేసినోళ్లు ఎవరున్నరు? ఒక్కడన్న రైతుల్ని పట్టించుకున్నడా? ఇప్పుడొచ్చి అది చేస్తం, ఇది చేస్తం అని చెప్తున్నరు. రాష్ట్రంలో బీజేపోళ్లకు ఏం పని? ఇక్కడ వాళ్లు చేసిందేంటిది? కాళ్లల్లో కట్టెపెట్టుడు తప్ప! మాకు మంచి చేసిన వాళ్ల మేలు మర్చిపోం. మేలు చేసిన వారికి అపకారం చేయం.
– నల్లగొండ జిల్లా దామర గ్రామ రైతులు
ఆయనకు చేతనైనకాడికి చేసిండు
ఇప్పటికే రైతుల కోసం సీఎం కేసీఆర్ చానా చేసిండు. రైతులకు ఇంత మేలు జరుగుతదని ఎవ్వలు అనుకోలే. పింఛను, రైతుబంధు ఇచ్చి ఆదుకుంటుండు. రైతుల కోసం ఆయనకు చేతనైనకాడికి చేస్తనే ఉన్నడు. ఇంకా ఎక్కువ ఆశపడితే కూడా మంచిది కాదు. ఆయనకు కుదిరితే ఇంకా చేస్తనే ఉంటడు.
– కొత్తగుళ్ల ఈరయ్య,ముదిగొండ మల్లయ్య, దేవతిపల్లి గ్రామం
కేసీఆరే మా దేవుడు
కేసీఆర్ సీఎం అయినంకనే మా బతుకులు మారినై. ఎవుసం బాగుపడ్డది.. నాలుగు ముద్దలు కడుపునిండా తినగలుగుతున్నం. పింఛను ఇస్తుండు, రైతుబంధు ఇస్తున్నడు, కావాల్సినవి అన్నీ చేస్తున్నడు. మా బతుకులు మార్చింది కేసీఆరే.. ఆయనే మా దేవుడు.
-నర్సింహ, దన్గాం,నారాయణపురం మండలం
గోసలు అన్నీ పోయినై
కేసీఆర్ మాకు అంతా మంచిగనే చేసిండు. ఎవుసం చేసే రైతులను అదుకుంటున్నడు. ఉచిత విద్యుత్తు ఇస్తున్నడు, రైతుబంధు ఇస్తున్నడు. రైతులకు ఏది అవసరమో అన్నీ ఇస్తున్నడు. తెలంగాణ వచ్చినంకనే మాకు మేలు జరుగుతున్నది. అప్పుడు పడ్డ గోసలు అన్నీ పోయినై. -మంచాల పిచ్చయ్య, జనగామ, యాదాద్రి జిల్లా