హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా పవన్‌కల్యాణ్ అభిమానులు.. హ్యాట్సాఫ్ సీఎం సార్ అంటూ విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. కేసీఆర్, పవన్‌కల్యాణ్, వంగవీటి మోహనరంగా నిలువెత్తు కటౌట్‌తో ఫ్లెక్సీని రూపొందించారు. అందులో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫొటోలు ఉన్నాయి. సినిమా టికెట్ ధరలతో పాటు ఇతర విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతగా ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. భీమ్లానాయక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. సినీ పరిశ్రమకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్‌షోలకు సైతం అనుమతి ఇచ్చారు.