ఎవడో మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకోవాలి. ఎవరో వచ్చి మన మీద జోకులేయడం ఏంటి… మనలో మనమే జోకులేసుకుని ఎదుటి వాళ్లను నవ్వించాలి. ఇలాంటి చిత్రమైన వ్యవహారాలు హస్తం పార్టీకి అలవాటు. తమలో తాము ఇలాంటి పనులు చేయడమే కాదు, పార్టీ ప్రధాన నేత రాహుల్‌నూ ఇదే ధోరణిలో ఇబ్బంది పెడుతుంటారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా ఎన్నికల ప్రసంగాల ట్రాన్స్లేషన్ల విషయంలో దక్షిణాది నేతలు రాహుల్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ జనానికి హాస్యాన్ని పంచుతున్నాయి. రాహుల్ ప్రసంగం కన్నా వీళ్ల తర్జుమాలే జనంలోకి బాగా వెళుతుంటాయి. కేరళ ఎలక్షన్ల సందర్భంగా ఆయన స్పీచ్ చెబుతుంటే… చెప్పిన దాన్ని తికమకగా ట్రాన్స్‌లేట్ చేయడమే కాదు, ఆ.. ఏం అన్నారు… అంటూ పదే పదే ఆయన్ను అడిగారు అక్కడి సీనియర్ నేత పి.జె.కురియన్. తమిళనాడులోనూ తాను చెప్పేది ప్రజలకు చేరవేయడంలో గందరగోళ పడిపోతున్న నేతలను చూసి రాహుల్ అసహనం వ్యక్తం చేయడం తప్ప ఏం చేయలేకపోయారు.
అసలే కష్టపడి ప్రసంగ పాఠాలు నేర్చుకున్న ఆయన, క్రితంసారి గద్వాలలో ఏదో ఉద్వేగంగా ప్రసంగిస్తుంటే… దాన్ని అనుసరించలేక పొరబడి తడబడ్డారు అప్పటి కాంగ్రెస్ నేత డి.కె. అరుణ. ఇక, నిన్నటికి నిన్న ఆయన చెప్పాల్సింది అయిపోయినా విషయం అందుకోకుండా అనువాదకులు జీవన్‌రెడ్డి పరధ్యానంగా ఉండటంతో, చెప్పండి…అంటూ రాహుల్ మైకును తట్టాల్సి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ‘అసలే నేను ఎక్కడ మొదలు పెడతానో, ఎక్కడ ఆపుతానో నాకే తెలియదు. వీళ్లు ఎక్కడ నుంచి అందుకుంటారో, ఎక్కడ ఆపుతున్నారో వీళ్లకే తెలియడం లేదు. నా ప్రాణానికి ఆడొగడు ఆడొగడు మోపైనారు’ అని తలపట్టుకోవడం రాహుల్ వంతయింది.
– హరిత