ఎగుమతులు ఎందుకు పడిపోయినయి? మేకిన్ ఇండియా జోకిన్ ఇండియా అయిందా? విశ్వగురు ఏమైపాయె? ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి విశ్వగురు అవసరం లేదు. దేశగురు చాలు అంటున్నరు భారత ప్రజలు.అందుకే అన్నిచోట్లా బీఆర్ఎస్కు జేజేలు పలుకుతున్నరు. అయినా పని చేస్తే గురువు. మాటల గురువైతె ఎట్ల?
కాంగ్రెస్‌తో కాలే. బీజేపీతో కాలే. అందుకే విసుగెత్తి నేను వచ్చిన. మేమే అధికారంలోకి వస్తం. ప్రతి ఎకరానికీ సాగునీరిస్తం. ప్రతి ఇంటికీ తాగు నీరిస్తం. 24 గంటలు కరెంటు ఇస్తం. చెప్పుడు కాదు. చేసి చూపిస్తం తెలంగాణలో చూపించలేదా. మేమే అధికారంలోకి వస్తం. అట్లనే చూపిస్తం.
నేను ఇండియన్‌ను.. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన భారతీయుడిని. ఐ యామ్ యాన్ ఇండియన్..
ఇది ఒక దేశభక్తుడి సగర్వ ప్రకటన……కాంగ్రెస్‌తోని కాలె.. బీజేపీతోనె కాలె.. అందుకే బీఆర్ఎస్. వట్టిగ షోకుల కోసం ఈ పార్టీని పెట్టలె. మేం విసిగి వేసారిపోయినం. నేనూ, మోదీ సమాంతరంగా ఒకేసారి అధికారంలోకి వచ్చినం. ఆయన ప్రధాని అయ్యిండు. నాలుగైదురోజులకు నేను ముఖ్యమంత్రి అయిన. చూసీ.. చూసీ.. చూసీ.. విసిగిపోయి, యాష్టకొచ్చి, రిటైరయ్యే వయసులో నేను ఈ పని మీదికెత్తుకున్న. చూడబుద్దయితలేదు. ఈ దేశం ఇట్ల నాశనం అయితుంటె.
…ఇది భూమి పుత్రుడి ఆవేదన
జలపాతం వంటి వాగ్ధార.. జలదరించేలా గణాంకాల హోరు.. ఆవేదన కమ్ముకున్న స్వరం… దేశం దుస్థితిని వర్ణించే గళం.. అది మాట కాదు.. నిప్పులాంటి నిజాన్ని వర్షిస్తూ దూసుకొచ్చిన తూటా. జరిగిందేమిటి? జరుగుతున్నదేమిటి? ఇట్లాగే సాగితే ఈ దేశానికి జరగబోయేదేమిటి? ఇది ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రసంగం మాత్రమే కాదు. ఒక దార్శనికుడు.. సమాజానికి ఎత్తిచూసిన దారిదీపం. ఇదొక మేధావి దేశం ముందు చర్చకు పెట్టిన ఎజెండా. ఇదొక నాయకుడు ప్రజలకు చూపిన మార్గదర్శనం. అదొక ప్రసంగం కాదు.. వాక్ ప్రవాహం.
..అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం
ముంపు బాధితులకు పరిహారం
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా ముంపునకు గురవుతున్న ప్రాంతం ఉన్నదనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు వెంటనే సర్వే చేయిస్తాం. నిజంగానే నష్టం ఉంటే ఆ భూమిని కూడా సేకరించి బాధితులకు పరిహారం అందజేస్తాం.
డైట్ చార్జీలు పెంచుతం
గతంలో అడగకుండా విద్యార్థుల డైట్ చార్జీలు పెంచాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తులను మన్నిస్తాం. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థుల డైట్చార్జీలను పెంచాలి. ఏ మేరకు పెంచాలో, అవసరమైతే ఈటలకు ఫోన్ చేసి సలహా తీసుకోవాలి. ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ చర్చించి రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేయాలి.
మహిళలకు రుణాలు
మహిళల రుణాల విషయంలో సమస్యేమీ లేదు.. ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు పెట్టకుండా ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఏ నెలకు ఆ నెల క్లియర్ చేయాలి. గెస్ట్ లెక్చరర్లు ఉన్నన్ని రోజులు వారికి జీతాలు ఇవ్వాలి.
ఉద్యోగులకు వేతనాలు పెంచుతం
దేశంలోనే మన రాష్ట్ర ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్నం. రాష్ట్ర పురోగాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం… వారికి మళ్లీ వేతనాలు పెంచుతది.
-శాసనసభలో సీఎం కేసీఆర్
2023-24 నాటికి ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేస్తామని మోదీ ప్రకటించటం పెద్ద జోక్. ఆ లక్ష్యమే స్వల్పం, పోనీ దాన్నీ చేరుకున్నారా అంటే అదీ లేదు. అమెరికా ఆర్థికశక్తి 25, చైనా 18.3, జపాన్ 4.3, జర్మనీ 4 ట్రిలియన్ డాలర్స్.. ఇండియా ఎకానామీ ఇప్పటికీ 3.3 ట్రిలియన్ డాలర్లే. అసలు వాస్తవ ఎకానమీ గ్రోత్ పర్ క్యాపిటాలో ఉంటుంది. తలసరిపై ఐఎంఎఫ్ రూపొందించిన 192 దేశాల ర్యాంకుల జాబితాలో భారత్ ర్యాంకు 139. అదీ మన దేశ నిజమైన ఎకానమీ. పక్కనున్న బంగ్లాదేశ్ 138వ ర్యాంకులో ఉండగా, భూటాన్, శ్రీలంక కూడా మంచిస్థానాల్లో ఉన్నాయి.
సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తామంటున్న వాళ్ల సంగతి ప్రజలే చూసుకుంటారు. అట్ల కూలగొడితే కాళ్లు రెక్కలు ఇడిచి పడేస్తరు.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ పాలన గుడ్దెద్దు చేలో పడ్డట్టుగా సాగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మంచిది, చెడ్డది అని చూడకుండా అన్నింటినీ, అంతులేకుండా ప్రైవేట్‌పరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా ఏకంగా పారిపోతున్నదని, ఇదేమని అడిగితే సహించలేకపోతున్నదని మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. ‘మీడియాను బ్యాన్ చేయాలని కేసులా? ఇది ప్రజాస్వామ్యమా? ఇంత అహంకారమా? ఇంత అసహనమా? 2024లో బీజేపీ పతనం ఖాయం’ అని నిప్పులు చెరిగారు. బీజేపీ పద్ధతులు దేశానికి, సమాజానికి మంచివికావని అన్నారు. ఇకనైనా సంకుచిత రాజకీయాలు వీడాలని, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటిని ఇవ్వాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
కాడి వదిలేసినోడు సిపాయా?
మోదీ ప్రభుత్వం సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ (నష్టాలను ప్రజలమీద రుద్దాలి.. లాభాలను కార్పొరేట్లకు పంచాలి) అనే కుటిల నీతిని అనుసరిస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో, పేద ప్రజల కోణంలో కొన్ని రంగాల్లో కచ్చితంగా ప్రభుత్వం తగిన పాత్ర పోషించాల్సి ఉంటుందని, కానీ మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయబోమంటూ తప్పించుకోజూస్తున్నదని ధ్వజమెత్తారు. ‘ఎక్కడ అవసరముంటే అక్కడ కచ్చితంగా ప్రభుత్వమే తగిన పాత్ర పోషించాలి. అందులో భాగంగానే రైతుల ధాన్యం, మార్క్‌ఫెడ్ ద్వారా సజ్జలు కొంటున్నాం.
ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు స్వయంగా మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ అని పెట్టాం. ప్రజల సౌకర్యార్థం, క్రాస్ సబ్సిడీ చేయాల్సి ఉంటది. ప్రభుత్వం వ్యాపారం చేయాల్సి ఉంటది. లాభం వచ్చేవేకాకుండా నష్టం వచ్చేవాటిని సమ్మిళతం చేసి ముందుకుపోవాలి. మొత్తానికి మొత్తం ప్రైవేట్‌కు వదిలేయడం సరికాదు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో, పేద ప్రజల కోణంలో కొన్ని రంగాల్లో కచ్చితంగా ప్రభుత్వం పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాడి కిందపెట్టేవాడు సిపాయి ఎట్ల అయితడు? ప్రధాని మోదీ బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా ఏకంగా పారిపోతున్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేస్తం, కొంటే కొను లేకపోతే ఆకలితో చావు అంటే కుదరదు’ అని సీఎం స్పష్టంచేశారు.
2024లో బీజేపీ పతనం ఖాయం
బీజేపీ చెప్పే ముచ్చట్లు, ప్రదర్శిస్తున్న జులుం, పెడుతున్న కొట్లాటలన్నీ తాత్కాలికమని, ఎన్నో రోజులు ఉండబోవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2024లో బీజేపీ ఓటమి వందశాతం ఖాయమని స్పష్టంచేశారు. ‘బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీని స్వయంగా వాజ్‌పేయి పొగిడారు. దుర్గామాతగా అభివర్ణించారు. ఇక ఆమెకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎదురేలేదని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్క అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా చెలరేగిన నిప్పుతో ఏం జరిగిందో అందరికీ తెలుసు.
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపుమేరకు మహానాయకురాలిని దేశం గిల్లిపారేసింది. అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూడా అదే తప్పులు చేసిందని, దేశం మళ్లీ ఇందిరాగాంధీని తెచ్చిపెట్టుకొన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. ఏదైనా ప్రజలకు ఇష్టమున్నంతవరకే. కన్నుమిన్ను కానకుండా మాట్లాడటం, మేము చేసిందే రైటు, ఎవరేం అడిగినా చెప్పం అనే భావన మంచిది కాదు. సంయమనం, హుందాతనం ఉండాలి. లేదంటే సమాజం ఒప్పుకోదు’ అని బీజేపీకి చురకలంటించారు.
ఇంత అసహనమా?
ఎన్ని తప్పులు చేసినా తమనెవరూ ప్రశ్నించకూడదన్న అహంకారంతో బీజేపీ వ్యవహరిస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశా రు. ‘పొరపాట్లు దొర్లిపోతున్నా, దేశం అట్టుడుకుతున్నా గోదీ మీడియా రాయడం లేదు. రాసేవాళ్లు రాస్తున్నా దానిపై కేంద్రం ఏమాత్రం స్పం దించడం లేదు. కాంగ్రెస్‌ను తిట్టడమే బీజేపీ వాళ్ల ఏకైక నమూనా. ఇటీవల బీబీసీ గోద్రా ఘటనపై ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేస్తే, ఆ సంస్థను నిషేధించాలని బీజేపీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అంత అహంకారమా? ఎక్కడికి పోతున్నది ఉన్మాదం? అది దేశానికీ అలంకారమా? ప్రపంచం మనగురించి ఏమనుకొంటది? ఇంత అసహనమా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? దీని గురించి ప్రజాస్వామికవాదులు, సమాజ పురోగతిని ఆకాంక్షించేవాళ్లు ఆలోచించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంత పెద్ద దేశాన్ని నడిపేప్పు డు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక తప్పు జరుగుతుందని, దానిని ధైర్యంగా ఒప్పుకోవాలి కానీ ప్రశ్నించినవాళ్లను జైళ్లలో వేస్తాం అనడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా..
దేశంలో చాలా గందరగోళం నెలకొని ఉన్నదని, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పరిస్థితి తయారైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను మించి రూ.48 లక్షల కోట్లకుపైగా ఆస్తులున్న, ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని అమ్మిపారేస్తం అంటే ఎలా? 1953లో నెహ్రూ ప్రభుత్వం జాతీయం చేసిన ఎయిరిండియాను, నేడు మోదీ సర్కారు తిరిగి మళ్లీ అదే టాటా కంపెనీకి ధారాదత్తం చేసింది. అమ్మకానికి కారణమేంటని పార్లమెంట్లో ఎంతమంది అడిగినా, పేపర్లలో ఎంత రాసినా కేంద్రం సమాధానం చెప్పడం లేదు. కానీ టైం వచ్చినప్పుడు కచ్చితంగా ఆ ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెప్తారు ’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబాటా?
మోదీ పాలనలో మన దేశం అన్ని సూచీల్లోనూ కిందికే వెళ్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘అంతర్జాతీయ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ అశ్వత్థ దామోదర్ లెక్క ప్రకారం అదానీకి ప్రస్తుతమున్న షేర్ వాల్యూ చాలా ఎక్కువ. అసలు వాస్తవాలు తెలిస్తే ప్రస్తుతమున్న స్థానం కంటే అదానీ మరింత కిందకు పోవడం ఖాయం. అంటే ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నవో ప్రజలంతా ఆలోచన చేయాలి’ అని సీఎం సూచించారు.
2023-24 నాటికి ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేస్తామని మోదీ ప్రకటించారు. అదో పెద్ద జోక్. 5 ట్రిలియన్ ఎకానమీ అనే లక్ష్యమే స్వల్పం. పోనీ దానిని చేరుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ 3.3 ట్రిలియన్ డాలర్లే. తలసరి ఆదాయానికి సంబంధించి ఐఎంఎఫ్ రూపొందించిన 192 దేశాల ర్యాంకుల జాబితాలో, భారత్ ర్యాంకు 139. అదీ మన దేశ నిజమైన ఎకానమీ’ అని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై పార్లమెంట్లో, శాసనసభల్లో, మీడియాలో ఎక్కడా చర్చ జరగడం లేదు. తూ కిత్నా అంటే మై కిత్నా అని కాంగ్రెస్, బీజేపీ దూషించుకొంటూ, వల్గారిటీస్ వైపు పార్లమెంట్‌ను తీసుకపోయాయి’ అని మండిపడ్డారు.
తెలంగాణ అన్నిమతాల గుల్దస్తా..
తెలంగాణ అన్నిమతాల గుల్దస్తా (పూలబొకే) అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఎంఐఎం నేత, అక్బరుద్దీన్ చేసిన విజ్ఞప్తులను త్వరితగతిన పరిశీలించాలని సభా వేదికగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు సూచించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు కట్టిన్నప్పుడు కొన్నిసార్లు అంచనా వేసినదానికంటే తక్కువ భూమి ముంపునకు గురవుతుందని, మరికొన్ని అంచనా దాటిపోతుందని వెల్లడించారు.
కాళేశ్వరం కోసం కట్టిన బరాజ్‌లలో కొన్ని ప్రాంతాల్లో అంచనా మించినట్టు ఉన్నదనే విక్రమార్క విజ్ఞప్తి మేరకు వెంటనే సర్వే చేయించాలని ఆదేశించారు. నిజంగానే నష్టం ఉన్నట్టయితే ఆ భూమిని కూడా సేకరించాలని, అందరికీ ఇచ్చినవిధంగా బాధితులకు పరిహారం అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా ఇంతకుముందు వచ్చినట్టు ట్రిప్స్ వస్తలేవనే అంశంపై కూడా సమీక్షించి చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడకు సూచించారు.
తిరుమలరాయుడి కథలా మోదీ తీరు..
పార్లమెంట్లో ఎదుటివాళ్లను కించపరుస్తూ ఎవరూ మాట్లాడకుండా బుల్డోజింగ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఒక సందర్భం, పద్ధతి లేకుండా, అయిందానికి, కానిదానికి మోదీని పొగుడుతున్నారని, అది విని తాను కూడా గొప్పని పీఎం అనుకుంటున్నారని విమర్శించారు. ఒక కథను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఉదహరించారు. ‘తిరుమలరాయుడు అనే రాజుకు ఒకటే కన్ను ఉంటది. అయినా తనకు ఇష్టం లేకపోయినా రాజువద్ద నుంచి బహుమతి పొందాలనే ఉద్దేశంతో..
అన్నాతి గూడి హరుడవు
అన్నాతిని గూడనప్పుడు అసురగురుడవు కన్నోంటి లేకపోతే అన్నా తిరుమలారాయ నీవు కౌరవపతివే’ అంటూ కవి కీర్తించిన వైనాన్ని సీఎం వివరించారు. ఈ కథను సీఎం విడమరచి చెప్పగా సభంతా నవ్వులతో నిండింది. ప్రస్తుతం మోదీని పొగుడుతున్న వాళ్లు కూడా ఆ కవిలానే ఉన్నారని, మోదీకి పొరపాట్లను చెప్పకుండా, ఏమీ లేకపోయినా, చేయకపోయినా అంతా బాగుంది బాగుంది అంటున్నారని విమర్శించారు. మోదీ దిగిపోయినా ‘మాజీ ప్రధానిగా ఉంటవు తక్కువేం ఉన్నది అంటరు’ కాబోలని సీఎం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.. తెలంగాణపై పక్షపాతం వీడండి
ఎన్నికల గెలుపులో, ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలని, సమాజం పురోగతి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఏమీ చేయకపోయినా, డబ్బా కొట్టుకోవడమనేది కరెక్టు కాదని మోదీ సర్కారుకు చురకలంటించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సంకుచిత రాజకీయాలను మానుకోవాలని, తెలంగాణపై పక్షపాతాన్ని వీడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు సహకరిస్తే తప్పకుండా రాష్ట్రం కేంద్రానికి సహకరిస్తుందని వెల్లడించారు. గతంలో అడగకుండా విద్యార్థుల డైట్ చార్జీలు పెంచామని తెలిపారు.
అయినా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తులను మన్నిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల డైట్ చార్జీలను పెంచాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి సూచించారు. ఏ మేరకు పెంచాలో చూడాలని, అవసరమైతే ఈటలకు ఫోన్ చేసి సలహా తీసుకోవాలని, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్‌తో చర్చించి ఎంత మేరకు, ఎక్కడెక్కడ ఎంతమేరకు పెంచాలో అంతవరకు పెంచుతూ రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేయాలని సూచించారు. మహిళల రుణాల విషయంలో కూడా సమస్యేమీ లేదని, బకాయిలు పెట్టకుండా ఏ నెలకు ఆ నెల క్లియర్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. గెస్ట్ లెక్చరర్లు ఉన్నన్నీ రోజులు వారికి జీతాలు ఇవ్వాలని చెప్పారు. అనంతరం అవకాశాన్ని కల్పించిన శాసనసభకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
2023-24 నాటికి ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేస్తామని మోదీ ప్రకటించారు. అదో పెద్ద జోక్. 5 ట్రిలియన్ ఎకానమీ అనే లక్ష్యమే స్వల్పం. పోనీ దానిని చేరుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ 3.3 ట్రిలియన్ డాలర్లే.
– సీఎం కేసీఆర్
ఏందా పొగుడుడు? అయినదానికీ కానిదానికీ పొగుడుడేనా? భజన బృందం మోదీనిట్ల పొగుడతనే ఉంటది. పొగుడుతనే ఉంటరు. ఎప్పటిదాకా. మాజీ ప్రధాని అయ్యేదాక. తర్వాత మాజీ ప్రధాని మోదీ అని పొగుడుతరు. పొగిడేటోనికి పొయ్యేదేముంది?
– సీఎం కేసీఆర్
దేశంలోని ఇరిగేషన్ పాలసీని సమూలంగా తీసి బంగాళాఖాతంలో పడేసి కొత్త ఇరిగేషన్ పాలసీని ప్రవేశపెట్టాల్సిందే. ఈ పనిని కాంగ్రెస్, బీజేపీ చేయలే కపోయాయి. కచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తది. చేసి చూపిస్తం. ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. ఐదారేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తాం.
– సీఎం కేసీఆర్
ఒక రేషన్ డీలర్‌తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాటా?
చాలా బాధ అనిపిస్తున్నది. ఇంతపెద్ద ఈ సువిశాల భారతదేశానికి అర్థిక మంత్రిగా పనిచేసే వ్యక్తి వచ్చి, బాన్సువాడలో ఒక రేషన్‌షాపు దగ్గరికి వచ్చి నిలబడి డీలర్‌తో కొట్లాట పెట్టుకుంటదా? ప్రధానమంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదని! ఒక డీలర్‌తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాటపెట్టుకుం టదా? పాపం.. సిందువులో బిందువంత డీలర్ ఏమై పోవాలె? అయినా ఏం సాధించిండని, ఏం గొప్పతనం చూపిండని మోదీ ఫొటో పెట్టుకోవాలె?
ఒక్క రైలును ప్రధాని ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?
ఒకటే ఒక రైలు.. అదీ బర్రె గుద్దితే పచ్చడైపోతున్న వందే భారత్ రైలుకు ప్రధాన మంత్రి వెళ్లి 14 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తడా? గతంలో ఇంతకన్న మంచి రైళ్లు శతాబ్ది, రాజధాని వంటివి మొదలు కాలేదా? గతంలో ఎప్పుడన్న ప్రధానమంత్రి ఇట్ల రైళ్లకు ప్రారంభోత్సవాలు చేసిండా? ఇంతకంటె అన్యాలం ఉంటదా?
రైల్వే స్టేషన్లో లిఫ్టును జాతికి అంకితం చేస్తరా!
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు టూత్ పాలిష్ చేస్తరట. రంగులేస్తరట. దానిని ప్రధానమంత్రి వచ్చి ప్రారంభిస్తడట. మరో కేంద్ర మంత్రి వచ్చి రైల్వేస్టేషన్లో లిఫ్టులను, అదే జనం ఎక్కి దిగే లిఫ్టులను జాతికి అంకితం, నిజమేనండీ జాతికి అంకితం చేస్తడు. ఏమన్న ఉన్నదా! ఇదా దేశాన్ని నడిపే పద్ధతి!
– సీఎం కేసీఆర్